Saturday, 16 July 2011
telangana pi korkamiti charcha
కాంగ్రెస్ కోర్ కమిటీ శుక్రవారం నాడు మరోసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వివాదం గురించి చర్చించింది. తెలంగాణ రాష్ట్రం కోరుతూ ఆ ప్రాంతానికి చెందిన దాదాపు వంద మంది శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పదిహేనుమంది పార్లమెంటు సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఎదురుకానున్న పరిణామాలపై కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. గులాం నబీ ఆజాద్ కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో దాదాపు 15 నిమిషాలపాటు విడిగా సమావేశమయ్యారు. ప్రధాని నివాసం 7, ఆర్‌సిఆర్‌లో సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి అహ్మద్ పటేల్‌తోపాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ప్రజాప్రతినిధుల రాజీనామాల అనంతరం తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై కమిటీ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం విస్తరణ అనంతరం వారం, పది రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వివాదంపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇటీవల వెల్లడించటం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ల ప్రకటనపై రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ బీజింగ్‌లో తీవ్రంగా స్పందిస్తూ రాష్ట్ర శాసన సభలో ఏకాభిప్రాయంతో ఒక తీర్మానాన్ని ఆమోదించనంత వరకు తెలంగాణ ఏర్పాటు అంశం ఒక్క అంగుళం కూడా ముందుకు సాగదని ప్రకటించటం, దీనిపై తెలంగాణలో తీవ్ర ప్రతికూల స్పందన రావటం తెలిసిందే. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చాయని అంటున్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు పలు ప్రతిపాదనల గురించి చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ అంశంపై కోర్ కమిటీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది వెల్లడికావటం లేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment