Tuesday, 19 July 2011

adistanam pi tiraga badaina telangana sadinchukuntam

తెలంగాణపై రెఫరెండానికీ రెడీ: జానారెడ్డి
రేపు తెలంగాణలో ‘సామూహిక నిరాహార దీక్ష’
26న ఊరూరా తెలంగాణ కాంగ్రెస్ జెండా పండుగ
నెలాఖరులోపు భారీ బహిరంగ సభ
తెలంగాణ కాంగ్రెస్ నేతల విస్తృత భేటీ తీర్మానాలు

తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ స్థాయి దాకా తీసుకెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదింటి దాకా ‘సామూహిక నిరాహార దీక్ష’ చేయాలని తీర్మానించారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 26న ఊరూరా తెలంగాణ కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించాలని, నెలాఖరులో భారీ బహిరంగ సభ జరపాలని సోమవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానించారు. అధిష్టానంపై తిరగబడైనా తెలంగాణ సాధించుకోవాలని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ పిలుపునిచ్చారు! డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే దళితుడే సీఎం కావచ్చన్నారు. జానారెడ్డి, కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల, బ్లాక్ నాయకులు, జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, డీసీఎంఎస్ చైర్మన్లతో పాటు వందలాది మంది నేతలు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర సాధనకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ‘‘26న గ్రామ, మున్సిపల్ వార్డు స్థాయిల్లో కాంగ్రెస్ కార్యకర్తలంతా తమ ఇళ్లపై తెలంగాణ ఆకారంలో రూపొందించిన కాంగ్రెస్ పతాకం ఎగరేసి ‘తెలంగాణ కాంగ్రెస్ జెండా’ పండుగ నిర్వహించాలి. ఆజాద్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను బాధించినందున ఆయన వాటిని ఉపసంహరించుకుంటే తప్ప ఢిల్లీ వెళ్లకూడదు’’ అని తీర్మానించారు.

సమావేశంలో సుమారు 40 మంది మాట్లాడారు. కమిటీ చేపట్టే ఏ ఉద్యమానికైనా పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నామని గతంలో చేసిన ప్రకటనను తక్షణం అమలు చేయాలని కేంద్రాన్ని జానారెడ్డి డిమాండ్ చేశారు. ‘‘90 శాతం మంది ప్రజల ఆమోదంతో రెఫరెండం ద్వారా దక్షిణ సూడాన్ కొత్త దేశంగా అవతరించింది. తెలంగాణలోనూ 90 శాతం మంది తాము ప్రత్యేక రాష్ట్రానికి సానుకూలమని వివిధ పద్ధతుల్లో తెలిపారు. రెఫరెండంతో సహా మరే పద్ధతిలో అయినా ప్రజాభిప్రాయాన్ని సేకరించితక్షణం తెలంగాణను ప్రకటించాలి’’ అన్నారు. విభజనలో ఆగ్రహాలు, ఆందోళనలు వెల్లువెత్తి అభివృద్ధి కుంటుపడకుండా సామరస్యంగా విడిపోయి రెండు ప్రాంతాల ప్రజలు విజ్ఞత చూపాలని కోరారు. తెలంగాణ సాధన చివరి దశలో ఉందని, కచ్చితంగా సాధించుకు తీరుతామని కేకే ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూనే తెలంగాణ సాధిస్తామని, రాజీ ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రులంతా ఏకతాటిపై ఉన్నా కొందరిని విడదీసేందుకు ప్రేలాపనలు చేస్తున్నారని మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలంతా రోడ్లపైకి వచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని జూపల్లి కృష్ణారావు సూచించారు. ‘‘ఒకరోజు ఇంటిముందు నిలబడి అరగంట పాటు తెలంగాణ నినాదాలు చేయాలి. మరో రోజంతా రోడ్లపై ఇంటి, వంట పనులు చేసుకోవాలి. ఇంకో రోజు రోడ్లను దిగ్బంధించాలి. అప్పుడే కేంద్రానికి తెలంగాణ సెగ తాకుతుంది’’ అన్నారు.

సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆర్థిక మూలాలను కబళిస్తేనే తెలంగాణ సాధ్యమని, సామూహిక దీక్షలతో ప్రయోజనముండదని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సీమాంధ్రులు నిర్మిస్తున్న సినిమాలన్నిటినీ బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. నెలాఖరు లోపు తెలంగాణ ప్రకటన రాకుంటే జెండా, ఎజెండాలను పక్కనపెట్టి ఐక్యంగా ఉద్యమిద్దామని దామోదర్‌రెడ్డి ప్రతిపాదించారు. తెలంగాణ ప్రజల దమ్మేంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ వివేక్ అన్నారు. కలిసుండలేమని తెలంగాణ ప్రజలంతా నెత్తినోరు కొట్టుకుంటున్నా కలిసుంటేనే కలదు సుఖమని సీమాంధ్ర నేతలనడం సిగ్గుచేటని ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ రాకుండా రాజీనామాల ఉపసంహరణ పులినోట్లో తల పెట్టడమే అవుతుందని ఎంపీ రాజయ్య అన్నారు. ఆగస్టు లోపు తెలంగాణ ప్రకటన రాకుంటే సింగరేణి కార్మికుల సమ్మెతో రాష్ట్రమంతటా కరెంటు సరఫరా ఆగుతుందని ఎమ్మెల్సీ బి.వెంకట్రావు హెచ్చరించారు. తెలంగాణకు సోనియా సానుకూలమైనా కోటరీ వల్లే వెనకాడుతున్నారని మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి అన్నారు.

No comments:

Post a Comment