వచ్చేనెల 17 నుంచి సమ్మెకు దిగాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన సకల జనుల సమ్మెలో పాలుపంచుకోవాలని తీర్మానించింది. మంగళవారం టీఎన్జీవో భవన్‌లో జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం స్వామిగౌడ్, జేఏసీ కో చైర్మన్లు దేవీ ప్రసాద్, విఠల్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస గౌడ్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. సకల జనుల సమ్మెలో ఆగస్టు 17 నుంచి పూర్తి స్థాయిలో పాల్గొనాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అప్పటి వరకు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక నిర్ణయించాన్నారు. వివిధ ప్రజా సంఘాలతో ఆగస్టు 1న హైదరాబాద్‌లో, 2, 3 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి సకల జనుల సమ్మెకు అందరినీ సమాయాత్తం చేస్తామని చెప్పారు. ఆగస్టు 2 నుంచి 6 వరకు తెలంగాణ జిల్లాల్లో ఉద్యమ యాత్ర పేరిట బస్సు యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. బస్సు యాత్రల కోసం 10 బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో బృందం ఒక్కో జిల్లాలో పర్యటిస్తుందన్నారు. ఉపాధ్యాయులు వచ్చేనెల 3న ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షకు దిగనున్నారని, 4, 5, 6 తేదీల్లో వివిధ విభాగాల ఉద్యోగులు నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. బ్యాంకులు, ఎల్‌ఐసీ ఉద్యోగులతో పాటు స్థానిక జేఏసీలు మండల కేంద్రాల్లోనూ రిలే నిరాహార దీక్షలు చేపడతాయని చెప్పారు. 8, 9, 11 తేదీల్లో 4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 3.5 లక్షల మంది వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు పెన్‌డౌన్, వర్క్‌డౌన్, టూల్‌డౌన్ నిర్వహిస్తారని, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపడతారని వివరించారు. అనంతరం 17 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగం లాంటి బెదిరింపు చర్యలకు దిగితే.. అదే రోజు నుంచి పూర్తిస్థాయి సమ్మె చేస్తామని హెచ్చరించారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగ సంస్థలు, సింగరేణి ఉద్యోగులు కూడా పాల్గొననున్నారని చెప్పారు. సింగరేణిలో సమ్మె జరిగితే రోజూ 1.4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుందని, విద్యుదుత్పత్తి ప్రధాన సంస్థలతో పాటు సుమారు 4 వేల పరిశ్రమల మీద సమ్మె ప్రభావం ఉంటుందని వివరించారు. ఆగస్టు 1లోగా కాంగ్రెస్ నాయకులు మళ్లీ రాజీనామాలు చేసి ఉద్యమంలో కలిసిరాకపోతే... వారి మీద ఒత్తిడి తెచ్చే దిశగా ఆందోళన ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. సహాయ నిరాకరణ సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. 141 మంది ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేస్తేనే సీరియస్‌గా తీసుకోని సర్కారు... తమ సమ్మె నోటీసును సీరియస్‌గా తీసుకోకపోవడం ఆశ్చర్యమేమీ కాదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమ్మె అంటే మొత్తం బంద్ చేస్తామని అర్థం కాదని, పాలన స్థంబింపజేయడమే సమ్మె లక్ష్యమని వివరించారు. కేవలం ఉద్యోగుల సమ్మె వల్ల తెలంగాణ వస్తుందని తాము భావించడం లేదని, సకల జనుల సమ్మెకు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ బిడ్డలుగా సమ్మెకు వెళ్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఉపాధ్యాయుల జేఏసీ చైర్మన్ పూల రవీందర్, ఎన్‌ఎంయూ నాయకుడు అశ్వథ్థామరెడ్డి, బీహెచ్‌ఈఎల్ కార్మిక నాయకుడు ఎల్లయ్య, సింగరేణి జేఏసీ నాయకులు మల్లయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
జేఏసీ సమావేశంలో చేసిన తీర్మానాలు ఇవీ..
1. ఆగస్టు 1లోగా తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు ఆమోదింపజేసుకొని సకల జనుల సమ్మెలో పాల్గొనాలి. రాజీనామాలు చేయని నేతలు వెంటనే చేయాలి.
2. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అవసరమైన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి.
3. ఆగస్టు 12న జేఏసీ విస్తృతస్థాయి సమావేశం ద్వారా సమ్మె సైరన్ మోగించాలి. పరిస్థితులను సమీక్షించి 17 నుంచి సమ్మెకు దిగాలి.
No comments:
Post a Comment