ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ప్రకటిస్తే హైదరాబాద్ సహా ఏ విషయంపైనైనా చర్చించటానికి సిద్ధమని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించటానికి అవసరమైన మద్దతును అందచేస్తామని ఆయన విలేఖరులకు చెప్పారు. తెలంగాణను ఇవ్వటంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసిన తరువాతే ప్రభుత్వానికి సమస్య తీవ్రత అర్థమైందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం మొదలుపెట్టిన చర్చలు లక్ష్య సాధన దిశలో జరగటం లేదని ఆయన పేర్కొన్నారు. ఇక ఎట్టి జాప్యం చేయకుండా ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆగస్టు ఒకటి లోపు తెలంగాణ గురించి స్పష్టమైన హామీ లభించకపోతే సకల జన సమ్మె తప్పదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణకోసం తాము ప్రారంభించనున్న సకల జన సమ్మె గురించి జాతీయ పార్టీల నాయకులకు వివరించటానికే తమ ప్రతినిధివర్గం ఢిల్లీకి వచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణకు జాతీయ పార్టీల నాయకుల నుంచి పూర్తి మద్దతు లభించిందని ఆయన చెప్పారు.
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత: డిజిపి
హైదరాబాద్, జూలై 28: పోలీసు శాఖలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామని డిజిపి వి.దినేష్‌రెడ్డి చెప్పారు. అంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తరపున సభ్యులు డిజిపిని కలిశారు. ఈ సందర్భంగా సభ్యులు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను డిజిపి దృష్టికి తీసుకెళ్ళారు. సిబ్బందికి వెయిటేజ్ ఇంక్రీమెంట్, మహిళా పోలీసులకు సౌకర్యాలు వంటి అంశాలను వారు వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని డిజిపి హామీ ఇచ్చారు. డిజిపిని కలిసిన వారిలో అధ్యక్షుడు కెవి చలపతిరావు, ఉపాధ్యక్షుడు రవీంద్రకుమార్, గౌరవ అధ్యక్షుడు సి.రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment