తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఆగస్టు 1నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, అధికారుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆందోళనకు శ్రీకారం చుట్టనుంది. రెండువారాలపాటు వివిధ దశల్లో ఆందోళనను ఉధృతం చేసి, చివరగా ఆగస్టు 17నుంచి సార్వత్రిక సకల జన సమ్మెకు దిగాలని తెలంగాణ ఉద్యోగ ఐకాస నిర్ణయించింది. హైదరాబాద్ టిఎన్‌జివో భవన్‌లో మంగళవారం తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస చైర్మన్ కె స్వామిగౌడ్ అధ్యక్షతన ఉపాధ్యాయ, సిబ్బంది, కార్మిక, అధికారుల సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. వివిధ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసు, ప్రభుత్వ స్పందన, తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో నాలుగు గంటల పాటు చర్చించారు. అనంతరం భవిష్యత్ ఆందోళన కార్యాచరణ రూపొందించారు. తెలంగాణ ఉద్యోగ ఐకాస నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవిప్రసాద్, విఠల్, కత్తి వెంకటస్వామి, మణిపాల్‌రెడ్డితో కలిసి స్వామిగౌడ్ తమ ఆందోళన కార్యాచరణను మీడియాకు వెల్లడించారు. 2009 డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి కేంద్రం వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలన్నారు. అలాగే గతంలో తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో ఆగస్టు 1నుంచి ఆందోళనకు దిగుతున్నట్టు చెప్పారు. ఆగస్టు 1న హైదరాబాద్‌లో అన్ని రాజకీయ పార్టీలతో తెలంగాణ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం, 2, 3 తేదీల్లో జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. 2నుంచి 6వరకు బస్సుయాత్రలు, 4నుంచి 6వరకు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద, జిల్లా, మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపడతారు. 8నుంచి 11వరకు వర్క్‌డౌన్ చేస్తామని పేర్కొన్నారు. అప్పటికీ తెలంగాణ అంశంపై కేంద్రం స్పందించి సానుకూల నిర్ణయం ప్రకటించకుంటే 17నుంచి సార్వత్రిక సకల జన సమ్మెకు దిగాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయించినట్టు స్వామిగౌడ్ వెల్లడించారు. ఈలోగా తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం ప్రకటన చేస్తే మెరపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. తమ ఆందోళనపై ప్రభుత్వం కక్షసాధింపుగా ఎస్మా ప్రయోగించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సకల జన సమ్మెకు ఏడు లక్షల మంది ఉద్యోగులు సంఘీభావం ప్రకటించగా, 4.37లక్షల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొంటారన్నారు. తాము సమ్మె నోటీసు ఇచ్చి 14రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, అలాంటప్పుడు చర్చలకు పిలిస్తే వెళ్లాల్సిన అవసరం లేదని వారు తెలిపారు.
ఆమోదించే వరకు రాజీనామాలు
తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధుల రాజీనామాలను స్పీకర్ ఏక్షపక్షంగా తిరస్కరించడం పట్ల సమావేశం నిరసన తెలియజేసిందని స్వామిగౌడ్ తెలిపారు. ప్రజాప్రతినిధుల హక్కును కాలరాయటం ప్రజాస్వామ్యంలో తగదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా మళ్లీ మళ్లీ రాజీనామాలు చేయాల్సిందేనని ఆయన విజ్ఞప్తి చేశారు.
నేడు ఢిల్లీకి టిజెఎసి
తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస చేపట్టే ఆందోళనకు మద్దతు కోరుతూ, అలాగే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేసేందుకు ఎనిమిదిమంది ప్రతినిధుల బృందం బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు టిజెఎసి అధికార ప్రతినిధి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బుధవారం ఉదయం పది గంటలకు శరద్‌యాదవ్‌తో, 11 గంటలకు ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, మధ్యాహ్నం సిపిఐ ప్రధాన కార్యదర్శి బర్దన్‌తో భేటీకి అపాయింట్‌మెంట్ లభించిందన్నారు. గురువారం ఉదయం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, మంత్రుల బృందంతో ఢిల్లీలో భేటీ అవుతామన్నారు.
No comments:
Post a Comment