Tuesday, 19 July 2011

charchala thvarane nirnayam: ఆజాద్

ఒక్కో ప్రాంతం నుంచి 5-10 మంది బృందంగా రావాలి
ముందుగా తెలంగాణ ప్రజా ప్రతినిధులతో మాట్లాడతా
ఢిల్లీలో ఆజాద్‌ను కలిసిన సీమాంధ్ర నేతల బృందం
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వినతి..
68 మంది నేతలు హాజరు.. కేంద్రమంత్రులు దూరం
నేడు ప్రధాని, ప్రణబ్, చిదంబరంలను కలవనున్న నేతలు
తెలంగాణ సమస్యపై మూడు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధుల ప్రతినిధి బృందాలతో చర్చించి ఎలా ముందుకు వెళ్లాలనేది నిర్ణయిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. ఒక్కో ప్రాంతం నుంచి ఐదుగురి నుంచి పది మంది వరకూ పార్టీ ప్రజాప్రతినిధుల ప్రతినిధి బృందం రావాలని సూచించారు. ‘‘తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను పిలిచాను. వారు రాలేదు. దీంతో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్నా’’ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్య రాష్ట్రంగానే కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్టానం, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు సోమవారం ఢిల్లీ చేరుకున్న సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాత్రి 10 గంటల సమయంలో ఆజాద్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. దాదాపు గంటన్నరపాటు ఆయనకు తమ వాదనలు వినిపించారు. అనంతరం ఆజాద్ తన కార్యాలయంవ వద్ద విలేకరులతో మాట్లాడారు. పార్టీ సీమాంధ్ర నేతలు చెప్పిందంతా విన్నానని, తానేమీ మాట్లాడలేదని ఆయన తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు రావటం వల్ల చర్చించటం కష్టమవుతుందని పేర్కొన్నారు. పరిమిత సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఉంటే చర్చలు సజావుగా సాగుతాయన్నారు. మూడు ప్రాంతాల (ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ) నుంచి 5 నుంచి 10 మంది సభ్యుల చొప్పున సంప్రదింపుల బృందంగా వస్తే చర్చించుకోవచ్చని సూచించారు. తెలంగాణ అంశం పరిష్కారం విషయంలో ముందుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలతో మాట్లాడతానని ఆజాద్ చెప్పారు.

సంమయనం పాటించండి: ఆజాద్ హితబోధ

ఆజాద్‌తో భేటీలో ఎంపీ కావూరి సాంబశివరావు, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి తదితరులు సమైక్య వాణిని గట్టిగా వినిపించినట్లు తెలిసింది. అలాగే.. ప్రాంతాల వారీగా వెనకబాటుతనాన్ని పారదోలటానికి చేపట్టాల్సిన చర్యలను కూడా సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారు చెప్పిందంతా విన్న ఆజాద్ సమావేశం చివరిలో.. ‘రాష్ట్రంలోని ఏ ప్రాంత నాయకులైనా సరే పరస్పరం పరుష పదజాలంతో దూషించుకోవటం సరికాదు. సంయమనంతో వ్యవహరించండి. మీరైనా, కార్యకర్తలైనా సరే సహనంతో ఉంటేనే ఈ సమస్య పరిష్కారమవుతుంది’ అని హితబోధ చేసినట్లు సమాచారం. ‘ఇప్పటికే రాష్ట్రంలోని భిన్న ప్రాంతాలవారు తమ నివేదనలు మాకు అందజేశారు. వాటిని పరిశీలిస్తున్నాం. ప్రతిసారీ ఇంత పెద్ద సంఖ్యలో రావటం కష్టం కదా. రాష్ట్రంలోని మూడుప్రాంతాల వారు పరిమిత సంఖ్యలో.. అంటే ఐదుగురికి తగ్గకుండా, 10 మందికి మించకుండా ప్రతినిధుల పేర్లను సూచించండి. ఆ ప్రతినిధుల బృందాలను నేను సమయానుసారం పిలిచి మాట్లాడతాను. సమస్యలు, వాస్తవ పరిస్థితులపై వారితో చర్చించి సమస్య పరిష్కారం దిశగా కృషిచేస్తాను. ఇదే విషయాన్ని ఇప్పటికే తెలంగాణ నాయకులకు కూడా చెప్పాను’ అని ఆజాద్ ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనికి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వెంటనే సమ్మతి తెలుపుతూ, తమ తరఫున పేర్లను కావూరి మీకు తెలియజేస్తారని పేర్కొన్నట్లు సమాచారం.

బ్లాక్‌మెయిళ్లకు తలొగ్గవద్దు: ఆజాద్‌కు నివేదన

కాంగ్రెస్ సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ వాదనల సారాంశాన్ని రెండు పేజీల నివేదన రూపంలో ఆజాద్‌కు అందజేసింది. శ్రీకృష్ణ కమిటీ విస్తృత సంప్రదింపులు, అభిప్రాయ సేకరణ, అధ్యయనం, పరిశోధన తర్వాత రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమే మంచిదంటూ నివేదికలో సూచించిన ఆరో ఆప్షన్ అమలు అందరికీ శ్రేయస్కరమని ఆ నివేదనలో కోరారు. ‘అభివృద్ధి లేదంటూ మొదట ఉద్యమం చేపట్టిన వారు గణాంకాలు చెప్తున్నది అందుకు భిన్నంగా ఉండటంతో సెంటిమెంట్, ఆత్మగౌరవం అంటూ కొత్త నినాదాలను అందుకున్నారు. ఈ సెంటిమెంట్ కూడా డిసెంబర్ 9, 2009 తర్వాత టీఆర్‌ఎస్, ఇతర పార్టీలు రెచ్చగొట్టటం వల్లే ఏర్పడింది’ అని అందులో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న మా సహచరుల నుంచి ఘోర అవమానాలు, బెదిరింపులు, హింసాకాండ, బ్లాక్‌మెయిల్ వచ్చినప్పటికీ క్రమశిక్షణ గల కాంగ్రెస్ వాదులుగా మేం మీ ఆదేశాలను పాటించి పూర్తి మౌనంగా ఉన్నాం. కానీ, మా మౌనం, వారి బ్లాక్‌మెయిల్ రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర నాయకత్వానికి భిన్నమైన అభిప్రాయాలు కలిగిస్తాయని మేం ఆందోళన చెందాం’ అని వివరించారు. బ్లాక్‌మెయిళ్లకు తలొగ్గవద్దని, దేశ సమైక్యత, సమగ్రతలను, ప్రజలను కాపాడేందుకు గట్టిగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.

సీమాంధ్ర నేతల విందుకు ఆస్కార్ హాజరు

మూడు ప్రాంతాల నేతలతో చర్చించాకే తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొంటామని ఆజాద్ తమతో పేర్కొన్నట్లు కాంగ్రెస్ సమైక్యాంధ్ర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫోరం కన్వీనర్ శైలజానాథ్ చెప్పారు. హైకమాండ్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్న దానిపై ఆజాద్ తమతో మాట్లాడలేదన్నారు. ఆజాద్‌తో భేటీ అనంతరం శైలజానాథ్, ఎంపీ కావూరి సాంబశివరావులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద ‘సమైక్య’ వాణిని వినిపించటానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 68 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సోమవారం ఢిల్లీ తరలివచ్చారు. వీరంతా మధ్యాహ్నం ఏలూరు కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు ఇంట్లో విందు సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ పెద్దలతో చర్చించాల్సిన అంశాలపై సమాలోచనలు సాగించారు. ఆ సందర్భంగా శైలజానాథ్, గాదె వెంకటరెడ్డి, కావూరి తదితరులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. సీమాంధ్ర నేతలంతా ఏకాభిప్రాయంతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే అభిప్రాయానికి వచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అంత తేలిక కాదని, దీన్ని అర్థం చేసుకున్నామని అధిష్టానం హామీ ఇచ్చినందుకే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నామని, ఇప్పుడు దాన్ని వక్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నందు వల్లే అధిష్టానం పెద్దలను మరోమారు కలవాల్సి వస్తోందని కావూరి చెప్పారు. రాత్రి ఆజాద్‌తో భేటీ ముగిసిన తర్వాత.. ఎంపీ నేదురుమల్లి నివాసంలో సీమాంధ్ర నాయకులు విందు సమావేశం నిర్వహించారు. ఈ విందులో పార్టీ అగ్రనేతల్లో ఒకరైన ఆస్కార్ ఫెర్నాండెజ్ కూడా పాల్గొనటం గమనార్హం.

నేడు ప్రధానిని కలవనున్న బృందం...

సీమాంధ్ర నేతలు బుధవారం వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు. తమ వాదన వినిపించటానికి పార్టీ, ప్రభుత్వ ముఖ్యులందరినీ కలవటానికి ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ లభించినట్లు వారు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎంపీలు మాత్రమే బృందంగా వెళ్లి ఆంటోనీని కలవనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు హోంమంత్రి చిదంబరాన్ని, సాయంత్రం 6 గంటలకు ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీని కలవటానికి సమయం లభించిందని సీమాంధ్ర నాయకులు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీలను కూడా అపాయింట్‌మెంట్లు కోరారు.

కేంద్రమంత్రులు దూరం...
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ఢిల్లీ యాత్రలో కేంద్ర మంత్రులు, పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు కనిపించకపోవటం ఒకింత చర్చనీయాంశమైంది. సీమాంధ్ర ప్రాంతం నుంచి రాష్ట్ర మంత్రిమండలిలో ఉన్న మంత్రుల్లో కొందరు మంత్రులు, ఎంపీల్లో పలువురు సోమవారం ఢిల్లీలో జరిగిన భేటీల్లో పాల్గొనలేదు. వీరు వీలువెంబడి మంగళవారం రావొచ్చని చెప్తున్నారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఉన్న నలుగురు మంత్రుల్లో కేబినెట్ మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఈ హడావుడికి పూర్తిగా దూరంగా నిలవగా మిగతా ముగ్గురు సహాయమంత్రులు వేర్వేరు చోట్ల ఉండటంతో.. మొత్తంగా కేంద్రమంత్రులెవరూ కనిపించని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర మంత్రులు పురందేశ్వరి, పనబాక లక్ష్మి, పళ్లంరాజు వివిధ కారణాల రీత్యా వేర్వేరు చోట్ల ఉన్నారని, అలాగే ఎంపీలు, రాష్ట్ర మంత్రుల్లోనూ ముందుగా అనుకున్న కార్యక్రమాల వల్ల రాలేకపోయినవారు కొందరున్నారని, వీరు రాలేకున్నా తామందరిదీ ఒకటే మాట అని వారు పేర్కొన్నారు.

ఢిల్లీయాత్రలో సోమవారం కనిపించిన నేతలు వీరే...

రాష్ట్ర మంత్రులు: సాకె శైలజానాథ్, ఆనం రామనారాయణరెడ్డి, డి.ఎల్.రవీంద్రారెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కాసు వెంకటకష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సయ్యద్ మహ్మద్ అహ్మదుల్లా, టి.జి.వెంకటేశ్, వట్టి వసంత్‌కుమార్, తోట నరసింహం, పి.బాలరాజు, ఎన్.రఘువీరారెడ్డి, పి.విశ్వరూప్, గల్లా అరుణకుమారి, డొక్కా మాణిక్యవరప్రసాద్, ధర్మాన ప్రసాదరావు

ఎంపీలు: కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణకుమార్, ఎ.సాయిప్రతాప్, సబ్బం హరి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరు బాపిరాజు, జె.డి.శీలం, కె.వి.పి.రామచంద్రరావు, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి

ఎమ్మెల్యేలు: గాదె వెంకటరెడ్డి, జె.సి.దివాకర్‌రెడ్డి, శిల్పామోహన్‌రెడ్డి, కొండ్రు మురళి, లబ్బి వెంకటస్వామి, శ్రీనివాసరావు, సతీష్‌కుమార్, జోగి రమేష్, మస్తాన్‌వలీ, కన్నబాబు, రాపాక వరప్రసాద్, రౌతు సూర్యప్రకాశరావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కె.సుధాకర్, ఈలి నాని, ఉగ్రనరసింహారెడ్డి, మల్లాది విష్ణు, పి.రమేష్‌బాబు, వెంకటరామయ్య, రాజన్నదొర, డి.వై.దాస్, రాజేశ్‌కుమార్,

ఎమ్మెల్సీలు, ఇతర నేతలు: సుధాకర్‌బాబు, రుద్రరాజు పద్మరాజు, చెంగల్రాయుడు, టి.జి.వి.కృష్ణారెడ్డి, ఐలాపురం వెంకయ్య, సూర్యనారాయణరాజు, శివరామిరెడ్డి, కందుల దుర్గేష్, సింగం బసవపున్నయ్య, శ్రీనివాసులునాయుడు, ఆర్.ఆర్.శ్రీనివాస్, వాకాటి నారాయణరెడ్డి, సి.రామచంద్రయ్య

ఇతర నేతలు: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి, మండలి బుద్ధప్రసాద్, పీసీసీ కార్యదర్శి కె.శివాజీ

No comments:

Post a Comment