తెలంగాణ అంశంపై పార్లమెంట్ సమావేశాలను వారంపాటు స్తంభింపచేయాలన్న ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నట్టు తెలిసింది. పార్లమెంటు సమావేశాలను స్తంభించటం ద్వారా తెలంగాణ అంశాన్ని కేంద్రం, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో వారున్నారు.
ఎమ్మెల్యేల రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించడంతో, ఎంపీల రాజీనామాలను కూడా లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అనుకుంటున్నట్టుగా జూలై నెలాఖరులోగా తెలంగాణపై అధిష్ఠానం నుంచి సానుకూల ప్రకటన ఏదీ వచ్చే సూచనలు కనిపించడం లేదు. కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియను చేపట్టడం, వంద రోజుల్లో అధిష్ఠానం ఒక నిర్ణయాన్ని ప్రకటించనుందని చెప్పిన నేపథ్యంలో తెలంగాణపై అధిష్ఠానం ఇప్పట్లో ప్రకటించే అవకాశం లేదన్న అభిప్రాయానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వచ్చారు.
ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ తిరస్కరించడంతో మళ్ళీ రాజీనామాలు చేయాలన్న ఒత్తిడి వస్తోంది. పార్లమెంటు సభ్యుల రాజీనామాలను కూడా తిరస్కరించినట్టు ప్రకటించిన పక్షంలో రాజీనామాలు చేయాలంటూ తమపై కూడా మళ్ళీ ఒత్తిడి వస్తుందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. నేరుగా స్పీకర్లకు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు ఇవ్వడం పట్ల అధిష్ఠానం ఆగ్రహంతో ఉంది. ఈ పరిస్థితిలో మళ్ళీ రాజీనామాలు స్పీకర్‌కు ఇచ్చినట్లయితే అధిష్ఠానం మరింత ఆగ్రహం చెందవచ్చని వారు అనుకుంటున్నారు.
తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. ఆగస్టు ఒకటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బహుశ ఈలోగానే లోక్‌సభ సభ్యుల రాజీనామాలపై స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించవచ్చని అనుకుంటున్నారు. తమ రాజీనామాలను తిరస్కరించినట్టు ప్రకటించిన పక్షంలో, రాజీనామాలకై మళ్లీ ఒత్తిడి రాకముందే పార్లమెంటు సమావేశాలను స్తంభింప చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అనుకుంటున్నారు. ‘ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించినట్టే పార్లమెంటు సభ్యుల రాజీనామాలనూ తిరస్కరించవచ్చు. అప్పుడు మేం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాం. తెలంగాణ అంశం మీద వారంపాటు పార్లమెంటు సమావేశాలు జరగకుండా అడ్డుకుంటాం. వారంపాటు పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం చిన్న విషయం కాదు’ అని ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘ నాయకుడు ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.
రాజీనామాలపై కాంగ్రెస్‌లో విముఖత?
మళ్ళీ రాజీనామాలు చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అంత సుముఖత వ్యక్తం కావడం లేదు. ఇంతకుముందు సామూహిక రాజీనామాలు చేసిన వారు సైతం ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నారు. మంత్రులు కూడా మళ్ళీ రాజీనామాలు చేసేందుకు ఇంత ఇష్టపడటం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మనోభావాలను తెలుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సారధ్య సంఘం నేతలు కూడా వ్యూహాత్మకంగా మళ్ళీ రాజీనామాలు చేసే అంశంలో నిర్ణయాన్ని వాయిదా వేశారు. పార్లమెంటు సభ్యుల, ఎమ్మెల్సీల రాజీనామాల వ్యవహారం కూడా తేలిన తర్వాత మళ్ళీ రాజీనామాల అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని సారధ్య సంఘం నేతలు అభిప్రాయ పడ్డారు.
స్పీకర్‌కు మళ్లీ రాజీనామాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు విముఖంగా ఉండటంతో రాజీనామాలు అవసరమైన పక్షంలో ఈసారి హైకమాండ్‌కు ఇవ్వాలని అనుకుంటున్నారు. స్పీకర్‌కు ఇవ్వడానికి ఇష్టపడని ఎమ్మెల్యేలు అధిష్ఠానవర్గానికి ఇద్దామంటే అంగీకరించవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదుమంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో ఎనిమిది మంది మినహా పనె్నండు మంది మంత్రులతో సహా 47మంది తమ శాసన సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ రాజీనామాలు అన్నపక్షంలో వారిలో సగం మంది కూడా ముందుకు వచ్చే అవకాశం లేదని అంటున్నారు.
No comments:
Post a Comment