Wednesday, 27 July 2011

telangana teledi kadu

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఎంతమాత్రం సులభం కాదని కేంద్ర హోంమంత్రి పి చిదంబరం చెప్పకనే చెప్పారు. రాష్ట్ర ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తేనే సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నిలువునా చీలిపోయాయని మంగళవారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పార్టీలు మొదట ఏకాభిప్రాయానికి రావాలని, అప్పుడే పరిష్కారాన్ని కనుగొనవచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రజలు, పార్టీలపై బలవంతంగా రుద్దటం జరగదని చిదంబరం ప్రకటించారు. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణ సమస్యపై ఇరుపక్షాలతో విడివిడిగా చర్చలు జరుపుతున్న సమయంలో చిదంబరం ఈ ప్రకటన చేయటం గమనార్హం. చిదంబరం ప్రకటన మూలంగా ఇప్పటికే తెలంగాణలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. చిదంబరం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు బుధవారం ఆజాద్‌తో రెండోదఫా చర్చలు జరుపుతారా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణా సమస్యకు ఒక పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి తోడ్పడాలని చిదంబరం సూచించారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీలపై తమ నిర్ణయాన్ని బలవంతంగా రుద్దటం జరగదన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ అంశంపై రెండుగా చీలిపోయాయి. సిపిఎం వాదన గురించి అందరికీ తెలిసిందేనని చిదంబరం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, బిజెపి పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉంటే, ఎంఐఎం తమ అభిప్రాయన్ని స్పష్టంగా వెల్లడించటం లేదని చిదంబరం చెప్పారు. కాంగ్రెస్‌కు సంబంధించినంత వరకూ తెలంగాణ అంశంపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయపర్చి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. పార్టీలో ఏకాభిప్రాయం సాధించటం ద్వారా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునేందుకు గులాం నబీ ఆజాద్ ప్రయత్నిస్తున్నట్టు చిదంబరం వెల్లడించారు. కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టే తెలుగుదేశం తదితర పార్టీలు కూడా తెలంగాణపై తమ పార్టీల్లో ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేయాలని హోంమంత్రి హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తమ ప్రజాప్రతినిధులందరినీ సమైక్యపర్చి తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కృషి చేయాలన్నారు. మీరు తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనలేకపోయారని ఆరోపించటం ఎంతో సులభం, అయితే ఆరోపణలు చేసే వారుకూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం సూచించలేకపోతున్నారని చిదంబరం దుయ్యబట్టారు. తమను విమర్శించే వారి వద్ద కూడా తెలంగాణ సమస్యకు పరిష్కారం లేదుకదా? అని అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై మీరు మాట నిలబెట్టుకోలేదనే విమర్శ వస్తోందని అడుగగా, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని తాను ప్రభుత్వం తరపున 2009 డిసెంబర్ 9న ప్రకటన చేశానని చిదంబరం వివరించారు. డిసెంబర్ 9 ప్రకటన తరువాత సీమాంధ్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో కేంద్రం పరిస్థితిని సమీక్షించి తమ నిర్ణయాన్ని మార్చుకుని డిసెంబర్ 23న రెండో ప్రకటన చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపునే తాను డిసెంబర్ 9 ప్రకటన చేశానన్నారు. కేంద్ర హోంమంత్రి ఒక ముఖ్యమైన అంశంపై తనంతతాను ఒక ప్రకటన చేసి, తరువాత ఉపసంహరించుకుంటారని ఎవరైనా భావిస్తే అది వారి అమాయకత్వమే అవుతుందని చిదంబరం స్పష్టం చేశారు.

No comments:

Post a Comment