Saturday, 23 July 2011

telangana pi charchalu malli malli

తెలంగాణపై చర్చల ప్రక్రియ మరోసారి ప్రారంభించేందుకు టి.కాంగ్రెస్‌ను ఒప్పించటంలో ఆ‘జాదూ’ విజయం సాధించారు. తెలంగాణను జీరోనుంచి మొదలు పెట్టక తప్పదని ఇంతకుముందు ప్రకటించిన ఆజాద్, కథను మళ్లీ అక్కడికే తీసుకొచ్చారు. శుక్రవారం తెలంగాణ ప్రజాప్రతినిధులతో మూడు గంటల పాటు విస్తృతంగా చర్చించిన ఆజాద్, అనంతరం సోమవారం నుంచీ ఇరుపక్షాలతో చర్చల ప్రక్రియ తాజాగా ప్రారంభం కానుందని మీడియాకు ప్రకటించారు. అందులో భాగంగానే సోమవారం పదిమంది తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతామన్నారు. అయితే, తెలంగాణపై తాజాగా చర్చలు ప్రారంభించే అంశంపై ఎంపీలు, మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఆజాద్ సమక్షంలోనే ఎంపీలు, మంత్రులు పరస్పర విమర్శలకు దిగినట్టు తెలిసింది. సీనియర్ నాయకులు జోక్యం చేసుకుని సర్దిచెప్పటంతో పరిస్థితి సద్దుమణిగింది. కొందరు ఎంపీలు సమావేశం ముగిసిన తరువాతా వాదులాడుకోవటం కనిపించింది. శుక్రవారం ఆజాద్‌తో మరోసారి సమావేశమైన టి.కాంగ్రెస్, సోమవారం నుంచి అధికారిక చర్చల్లో పాల్గొనేందుకు అంగీకరించారు. వాస్తవానికి శుక్రవారం నుంచే ఆజాద్‌తో అధికారిక చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆజాద్‌తో చర్చలు జరిపే పదిమందిని ఎంపిక చేసుకోవటంలో టి.కాంగ్రెస్ విఫలమైంది. తెలంగాణపై మళ్లీ చర్చలు ప్రారంభించాల్సిన అవసరం లేదంటూ ఇద్దరు ముగ్గురు ఎంపీలు గట్టిగా వాదించటంతో, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వారిపై విమర్శలకు దిగారు. ఇదిలావుంటే, ఆగస్టు 1నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే ‘తెలంగాణ’పై సానుకూల నిర్ణయం ప్రకటిస్తే రాజీనామాలు ఉపసంహరించుకుంటామని కొందరు ఎంపీలు ప్రతిపాదించారు. దీనిపై ఆజాద్ స్పందిస్తూ పరిమిత గడువులోగా తెలంగాణపై సానుకూల ప్రకటన చేయటం ఎంతమాత్రం సాధ్యం కాదని తెగేసి చెప్పినట్టు సమాచారం. యుపిఏ సంకీర్ణ సర్కారుకు ఎంపీల రాజీనామాల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా కుండబద్దలు కొట్టారు. దీంతో టి.కాంగ్రెస్ బృందం అయోమయంలో పడింది.
ముందు నిర్ణయించిన ప్రకారమైతే శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు పదిమంది నేతలతో తెలంగాణ అంశంపై ఆజాద్ అధికారిక చర్చలు ప్రారంభించాలి. అయితే ఆజాద్‌తో చర్చలు జరిపేందుకు వెళ్లాల్సిన పదిమందిని ఎంపిక చేసుకోవటంలో టి.కాంగ్రెస్ బృందం విఫలమైంది. మంత్రి కె జానారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు సాయంత్రం ఐదు గంటలకు ఆజాద్ వద్దకొచ్చి చర్చల అజెండా నిర్ణయిస్తే, చర్చలకు వస్తామని స్పష్టం చేశారు. ఇరువురు నేతలతో దాదాపు గంటపాటు చర్చలు జరిపిన ఆజాద్, అనంతరం మిగతా నేతలనూ అక్కడికి పిలిపించారు. ఆజాద్ మరోసారి 30మంది తెలంగాణ నేతలతో మూడు గంటలపాటు సంప్రదింపులు జరిపారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని టి.కాంగ్రెస్ గట్టిగా వివరించింది. దీనిపై ఆజాద్ స్పందిస్తూ ‘మీరిలా ప్రతిసారీ అందరూ మాట్లడుతూ కూర్చుంటే సమస్యను పరిష్కరించలేం’ అని స్పష్టం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర నేతల మధ్య ఏకాభిప్రాయం సాధించాలంటే ఇరుపక్షాలకూ చెందిన ఎంపిక చేసిన కొంతమందితో మాత్రమే సంప్రదింపులు జరుపుతామని ఆజాద్ తెగేసి చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యతపై మీ వాదన వినిపించింది. దానిపై సీమాంధ్ర నేతల అభిప్రాయాలు తెలుసుకుంటాం. వారు వ్యక్తం చేసే అంశాలపై మీ వాదనలు మళ్లీ వింటాం. ఇలా ఇరుపక్షాలతో పలు దఫాలు చర్చలు జరిపితేనే సమస్యకు పరిష్కారం కనుగొనే వీలు కలుగుతుంది’ అని ఆజాద్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే రాజధాని హైదరాబాద్ విషయంలో ఏం చేయాలనేది కూడా పరిశీలించవచ్చునని ఆయన సూచించినట్టు సమాచారం. ఇరుపక్షాలతో తాను జరిపే చర్చలపై ప్రభుత్వానికి, పార్టీకి నివేదిక అందిస్తానని, నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుందని టి.కాంగ్రెస్ బృందానికి ఆజాద్ స్పష్టం చేశారు. దీంతో సోమవారం నుంచీ తెలంగాణపై తాజా చర్చలు జరిపేందుకు టి.కాంగ్రెస్ అంగీకరించటంతో వివాదానికి తెర పడిందని అంటున్నారు.
రాజీనామాల విషయంలో విభేదాలు
ఎంపీ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను యథాతథంగా కొనసాగించాలా? లేక ఉపసంహరించుకోవాలా? అనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల్లో విభేదాలు పొడసూపాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సానుకూల ప్రకటన చేస్తే రాజీనామాలు ఉపసంహరించుకుంటామని కొందరు ఎంపీలు చేసిన ప్రతిపాదనను మరికొందరు ఎంపీలు గట్టిగా వ్యతిరేకించారని అంటున్నారు. చర్చల పేరిట మరోసారి మోసం చేస్తున్నారని ఒకరిద్దరు ఎంపీలు ఆరోపించినట్టు తెలిసింది. కొందరు రాష్ట్ర మంత్రులు రాజీనామాల విషయంలో మెత్తపడ్డారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చలు
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చ జరిగింది. సీమాంధ్ర నేతలతో తాను జరిపిన చర్చల గురించి లోక్‌సభ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ వివరంచారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణ, సీమాంధ్ర నేతలతో జరుపుతున్న చర్చల గురించి కూడా కోర్ కమిటీ సమీక్షించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆజాద్ ఇరుపక్షాల నాయకులతో చర్చలు జరిపిన అనంతరం యుపిఏ సంకీర్ణ సర్కారు, కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ అంశంపై ఒక ప్రకటన చేస్తుందని అంటున్నారు.

No comments:

Post a Comment