తెలంగాణ రాష్ట్ర సాధనకు చేస్తున్న ఉద్యమాల్లో భాగంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ నెల 18న సమావేశం కానున్నారు. ఈ నెల 18న తెలంగాణలోని మండల స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్షలు చేయాలని టి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల స్టీరింగ్ కమిటీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ఉద్యమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే పాల్గొంటున్నారా? జిల్లాల్లో ఇతర నాయకులు పాల్గొనడం లేదా? అనే అసంతృప్తిని జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు ఇతర నాయకులు వ్యక్తం చేశారని తెలిసింది. దీంతో ఈ నెల 18న చేపట్టాల్సిన దీక్షలను వాయిదా వేసి, అదే రోజున హైదరాబాద్‌కు తరలి రావాల్సిందిగా టి.కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల స్టీరింగ్ కమిటీ జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులకు పిలుపునిచ్చింది. 18న నిర్వహించాలనుకున్న దీక్షలను వారితో చర్చించి, 20 లేదా 21వ తేదీల్లో నిర్వహించాలని భావించినట్లు తెలిసింది.
ఈ నెల 13, 14 తేదీల్లో ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేసిన తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం పార్టీ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు నివాసంలో సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. 18న నిరాహార దీక్షలు చేయాలని పిలుపునిచ్చాం కానీ, అది ఎంత వరకు సక్సెస్ అవుతాయి?, కింది స్థాయి నాయకులను కలుపుకుని పోవడం లేదన్న భావన వ్యక్తమవుతున్నదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ప్రస్తావించినట్లు తెలిసింది. ఈ అభిప్రాయంతో మరికొందరు ఏకీభవించినట్లు తెలిసింది. తమను కలుపుకుని పోకుండా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకుని తమపై రుద్దుతున్నారని కింది స్థాయి నాయకులు అభిప్రాయపడుతున్నందున, 18న దీక్షలు లేకుండా అదే రోజున వారిని హైదరాబాద్‌కు పిలిపించి, చర్చించాలని నిర్ణయించారు.
అధిష్ఠానానికి నివేదించండి..
సమావేశానంతరం ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 18న విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. నగరంలో సమావేశాన్ని ఎక్కడ నిర్వహించేది తర్వాత తెలియజేస్తామని అన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్,, మున్సిపల్ చైర్మన్లు, మాజీ ఎంపిలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిహెచ్‌ఎంసి కార్పోరేటర్లను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా అధిష్ఠానానికి నివేదించమని కోరనున్నట్లు ఆయన చెప్పారు.
సోనియాకు డిఎస్ లేఖ
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. ఈ మేరకు డిఎస్ శుక్రవారం సోనియాకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్ల కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతం అవుతున్నందున, వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని ఆయన కోరారు. రాష్టప్రతి ఉత్తర్వుల్లోని 14ఎఫ్‌ను తొలగించాలని ఆయన కోరారు.
సిఎం మాతోనూ మాట్లాడాల్సింది: పొన్నం..
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులతోనే మాట్లాడి, రాజీనామా చేసిన టి.కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడకపోవడం సరైంది కాదని ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజీనామా చేసిన వారందరితో మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని పొన్నం ప్రభాకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాజీనామా చేసిన వారందరితో చర్చించి, వారి అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానానికి నివేదించాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పొన్నం అన్నారు. ఇలాఉండగా పొన్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీపై నిందలు వేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఎఐసిసి నాయకుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సోనియాపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
No comments:
Post a Comment