ప్రజల ఆకాంక్షను గౌరవించి, కేంద్రం వెంటనే తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గురువారం ముదిగొండ అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములను పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని, కాని పేద ప్రజలు జానెడు జాగా అడిగితే కాల్చి చంపారని విమర్శించారు.
యూపీఏ ప్రభుత్వం కుంభకోణాల్లో ఇరుక్కొ ని , కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సీపీఎం పేదప్రజల పక్షాన ఉండి , ప్రజాపోరాటాల చేస్తూ అమరవీరుల ఆశయ సాధనకు కృషిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
భట్టీ మట్టి కొట్టుకుపోతావ్: పొన్నం వెంకటేశ్వర్లు
మధిర నియోజక వర్గంలో సీపీఎంను అణచటానికి డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క కుయుక్తులు పన్నుతూ గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నాడని, అధికారంతో అధికారులను బెదిరిస్తూ తన చెప్పుచేతల్లో ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి పొన్నం వెంకటేశ్వర్లు అమరవీరుల సంస్మరణ సభలో తీవ్రంగా విమర్శించారు. ముదిగొండ తహసీల్దార్‌తో పాటు కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు.
సీపీఎంపై కక్షసాధింపు ధోరణి అవలంభిస్తున్నాడని విమర్శించారు. ఈ ధోరణి విడనాడకుంటే ప్రజా కంటకులు అందరిలా మట్టి కొట్టుకుపోతాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సభకు సీపీఎం మండల కార్యదర్శి కూరపాటి శ్రీనవాసరావు అధ్యక్షత వహించగా , సీపీయం నాయకులు బంకా మల్లయ్య . బండి రమేష్ , లింగాల కమల్రాజు , మచ్చా లక్ష్మి , బండారు రవికుమార్ , పీసీ వీరస్వామి, బండి పద్మ , వాసిరెడ్డి ప్రసాద్ , పాల్వాయి పాండు రంగారావు , భట్టు పురుషోత్తం పాల్గొన్నారు.
ఘనంగా నివాళి...
స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి అమరవీరుల స్మారక స్థూపం వరకు కార్యకర్తలు , నాయకులు , మృతవీరుల కుటుంబ సభ్యులు ప్రదర్శన నిర్వహించి స్మారక స్థూపం వద్ద అమరులకు ఘనంగా నివాళులర్పించారు. డప్పు బృందాలతో , ప్రజానాట్యమండలి కళాకారులు పాటలు నృత్యాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. సభా వేదికపైన ప్రజానాట్యమండలి కళాకారులు అమరవీరుల త్యాగాల పాటలు విన్పించారు. మృత వీరుల కుటుంబాల సభ్యులను సీపీఎం నాయకులు బంకా మల్లయ్య వేదిక మీదకు పిలిచి సభికులకు పరిచయం చేశారు.
‘నమస్తే తెలంగాణ’కు అభినందనల వెల్లువ...
ఆనాటి ముదిగొండ కాల్పుల ఘటనను కళ్ళకు కట్టినట్లు చూపించిన నమస్తే తెలంగాణ దినపత్రికను ముదిగొండ అమరవీరుల కుటుంబాల వారు అభినందనలతో ముంచెత్తారు. ఏ పత్రికలో రాయని విధంగా ఆమరవీరుల కుటుంబాల బాధలు వర్ణించారని పేర్కొన్నారు . పేద ప్రజానీకానికి తెలంగాణ ముద్దుబిడ్దలకు అండగా నిలిచిన నమస్తే తెలంగాణ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment