Thursday, 21 July 2011

Urura T - congres The March

ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ పిలుపు మేరకు బుధవారం తెలంగాణ జిల్లాల్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలు విజయవంతంగా జరిగాయి. రాజీనామాల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నేతలు జిల్లాలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భువనగిరి, ఆలేరుల్లో పర్యటించారు. ఆలేరులో ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ దీక్షలో పాల్గొన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో దీక్షలకు ఎమ్మెల్యే ఆర్.దామోదర్‌రెడ్డి హాజరయ్యారు. నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, దేవరకొండలో ఎమ్మెల్యే బాలూనాయక్ దీక్షల్లో పాల్గొన్నారు.

వరంగల్ జిల్లాలో అన్ని మండల కేంద్రాలతో పాటు, జనగామ, వరంగల్ నగరంలో పెద్ద సంఖ్యలో దీక్షా శిబిరాలకు అనూహ్యస్పందన లభించింది. ఉద్యమకారులు తెలంగాణ ఆటాపాటలతో హోరెత్తించారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, డాక్టర్ టి.రాజయ్య, కొండేటి శ్రీధర్, మాలోతు కవిత ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన దీక్షల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్, ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, సోమారపు సత్యనారాయణ, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు.

కరీంనగర్‌లో ఎంపీ పొన్నం ప్రభాకర్, శంకరపట్నంలో ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ స్వయంగా దీక్ష చేపట్టారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు కరీంనగర్ దీక్షకు, ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ధర్మపురిలో సంఘీభావం పలికారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో జరిగిన దీక్షకు పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు, డీసీసీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ హాజరుకాగా, వికారాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లో డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, నిర్మల్‌లో మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌లలో ఎంపీ వివేక్, మాజీ మంత్రి గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాగాయి. కాగా, మెదక్ జిల్లాలో దీక్షలు మొక్కుబడిగా సాగాయి.

డీసీసీ అధ్యక్షుడు, పటాన్‌చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అందుబాటులో ఉన్నా దీక్షలకు డుమ్మా కొట్టారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కూడా దీక్షల జాడలకు వెళ్లలేదు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా ప్రాతినిథ్యం వహిస్తున్న అందోలు నియోజకవర్గంలో దీక్ష ఊసు కనిపించలేదు.

No comments:

Post a Comment