Saturday, 16 July 2011

telangana pi jokyam chesuko thelchi cheppina suprim court

రాజకీయ నిర్ణయంతో ముడిపడి ఉన్న తెలంగాణ అంశంలో ఎటువంటి జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3(ఎ) లోని నిబంధనలకు లోబడి జరగలేదని, కనుక ఆ ప్రకటన చెల్లదని సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.సి. కపాడియాతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. హైదరాబాద్‌లో స్థిరపడిన రామచందర్‌రావు అనే మాజీ సైనిక ఉద్యోగి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ హెచ్.సి. కపాడియా, జస్టిస్ సుందర్, జస్టిస్ బాలచందర్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు శుక్రవారం విచారణకు వచ్చింది.

తెలంగాణలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రాథమిక హక్కులు అమలు కావడంలేదని, ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవాలని రామచందర్‌రావు పది నెలల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రకటించని పక్షంలో అంతర్యుద్ధం జరుగుతుందని కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలను, తెలంగాణ కోసం యుద్ధం మొదలైందని ఎంపీ విజయశాంతి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తన అఫిడవిట్‌లో పొందుపర్చారు. టీఆర్‌ఎస్ నేతలు హరీష్‌రావు, కేటీఆర్ తదితరులు ప్రజలను రెచ్చగొడుతున్నారని కూడా పేర్కొన్నారు. వారి వ్యాఖ్యల వల్ల ఇతర పార్టీ నాయకులపై భౌతికదాడులు జరుగుతున్నాయని, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా డిసెంబర్ 9 ప్రకటనను రద్దు చేయాలని కూడా తన పిటిషన్‌లో కోరారు.

కేసును విచారించిన ధర్మాసనం, రాజకీయ నిర్ణయంలో ముడిపడి ఉన్న తెలంగాణ అంశంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. తెలంగాణ అంశం అపరిపక్వత దశలోనే ఉన్నందున కోర్టు జోక్యం తగదని ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. టీఆర్‌ఎస్, ఇతర నాయకులు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడటానికి నిరాకరించిన ధర్మాసనం తెలంగాణ విషయంలో కోర్టు జోక్యం సరికాదని కేసును కొట్టివేసింది.

No comments:

Post a Comment