Thursday 21 July 2011

Telangana 'temporary solution' on the center of the exercise

తెలంగాణకు ‘తాత్కాలిక పరిష్కారం’పై కేంద్రం కసరత్తు







జమ్మూకాశ్మీర్‌కు తక్కువ.. గూర్ఖాలాండ్‌కన్నా ఎక్కువ ‘స్వయంపాలన’!

తెలంగాణ ప్రాంతానికి విస్తృతాధికారాలతో కూడిన ప్రాదేశిక అథారిటీ
సొంత ఆర్థికవనరులు, రెవెన్యూ విధానం, పరిపాలనా విభాగం, ఉద్యోగాల నియామకం... తదితర అధికారాలు
ప్రణబ్, చిదంబరం, ఆజాద్‌ల సూచనల మేరకు అనేక జాగ్రత్తలతో కసరత్తు
ముందుగానే అన్ని వర్గాలతో చర్చించాక బహిర్గతం చేసే యోచనలో కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో చర్చల్లో వివరించనున్న కాంగ్రెస్ అధిష్టానం
అథారిటీ తాత్కాలిక ఏర్పాటేనని, అందరికీ ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం కోసం కసరత్తు కొనసాగుతుందని హామీ ఇచ్చే యోచన

న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: సంక్లిష్టమైన తెలంగాణ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా.. ఆ ప్రాంతానికి విస్తృతాధికారాలు గల ‘ప్రాదేశిక అథారిటీ’ (టెరిటోరియల్ అథారిటీ)ని ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయం లేనందున.. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తూనే.. తాత్కాలిక పరిష్కారంగా మరింత ఆకర్షణీయమైన, మరింత హేతుబద్ధమైన ఏర్పాటుపై కసరత్తు చేసే బాధ్యతను కేంద్ర హోంశాఖకు అప్పగించినట్లు తెలిసింది. ఆమేరకు తెలంగాణ ప్రాంతానికి ‘ప్రాదేశిక అథారిటీ’ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్ర హోంశాఖ అధికారులు రూపొందిస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు బుధవారం ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపాయి. ఈ ప్రాదేశిక అథారిటీ అధికారాల విషయంలో.. జమ్మూకాశ్మీర్‌కు గల ‘స్వయంప్రతిపత్తి’ (అటానమీ)కి కొంచెం తక్కువగాను, ఇటీవల గూర్ఖాలాండ్‌కు ప్రకటించిన ‘స్వయంపాలన’ (టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్)కు కొంచెం ఎక్కువగాను ఉంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి.
‘‘తెలంగాణ ప్రాంతానికి విస్తృత అధికారాలు ఇచ్చేలా ఒక అథారిటీని ఏర్పాటు చేసే విషయాన్ని అధ్యయనం చేసి విధివిధానాలతో కూడిన ప్రతిపాదనను రూపొందించే పనిని మాకు అప్పగించారు. ఇందులో.. సొంత ఆర్థికవనరులు, రెవెన్యూ విధానం, పరిపాలనా విభాగం, ఉద్యోగాల నియామకం మొదలైనవన్నీ ఉంటాయి. ఒకవిధంగా.. ప్రత్యేక రాష్ట్ర హోదాకు కొంచెం తక్కువ స్థాయి అధికారాలన్నీ ఉంటాయి. అసోంలోని కర్బీ ఆంగ్‌లాంగ్ ప్రాంతానికి ఏర్పాటు చేసిన ప్రాదేశిక పాలనా మండలికి, పశ్చిమబెంగాల్‌లో గూర్ఖాలాండ్‌కు ప్రతిపాదించిన ప్రాదేశిక పాలనా మండలికన్నా.. ఎక్కువ అధికారాలు తెలంగాణ ప్రాదేశిక అథారిటీకి ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం కాగలదు’’ అని ఆ వర్గాలు వివరించాయి. రాష్ట్రానికి చెందిన వేర్వేరు గ్రూపులతో చర్చల్లో ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో.. ప్రాదేశిక అథారిటీ ఏర్పాటు ‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు పరిష్కారం కనుగొనటం’లో ఒక ముందడుగుగా ఉంటుందని అభివర్ణించాయి. ఈ ప్రాదేశిక అథారిటీ రూపకల్పనలో.. కాంగ్రెస్ అధిష్టానం ప్రతినిధులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్, ప్రణబ్‌ముఖర్జీ, చిదంబరం వంటి సీనియర్ మంత్రుల సూచనల మేరకు అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

తెలంగాణ నేతలతో చర్చల్లో ‘ప్రతిపాదన’

మరోవైపు.. చర్చల విషయంలో పార్టీ తెలంగాణ నేతలు మొత్తబడుతుండటంతో పాటు, సీమాంధ్ర నేతలు ఏ రూపంలోనైనా సంపూర్ణ మద్దతు అందిస్తామని హామీ ఇవ్వటంతో.. రాష్ట్రంలో గందరగోళంగా తయారైన పార్టీ వ్యవహారాలపై పట్టు సాధించటానికి ప్రాదేశిక అథారిటీ ఏర్పాటుతో కొంత సమయం లభిస్తుందని.. కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తోంది. చర్చలకు వస్తున్న తెలంగాణ నేతలకు ప్రత్యామ్నాయ మార్గాలన్నింటినీ మరోసారి వివరిస్తారని.. సహనం, సంయమనం అవసరాన్ని విశదీకరిస్తారని.. అదే సమయంలో ప్రతిపాదిత ‘ప్రాదేశిక అథారిటీ’ వివరాలను తెలియజేస్తారని సమాచారం. చిన్నచిన్న బృందాలతోనే చర్చలు జరుపుతామని గులాంనబీ ఆజాద్ పేర్కొనటం వెనుక కారణం ఇదేనని చెప్తున్నారు.

ఇదే తుది నిర్ణయం కాదు...

శ్రీకృష్ణ కమిటీ సిఫారసులపై ప్రజాభిప్రాయం బలంగా చీలిపోయిన నేపథ్యంలో.. ఈ ప్రాదేశిక అథారిటీ ఏర్పాటును డిసెంబర్ 9, డిసెంబర్ 22వ తేదీల ప్రకటనలకు ముందే చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కాంగ్రెస్ ఢిల్లీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఈసారి ప్రాదేశిక అథారిటీ ప్రతిపాదనను ఇప్పుడే బహిర్గతం చేయకుండా జాగ్రత్త పాటిస్తూ.. దీనిపై ముందుగానే అన్ని విధాలుగా ఆలోచించి, సంబంధిత వర్గాల వారందరితో మరింతగా చర్చించాలని కేంద్రం భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ ప్రతిపాదనతో పాటే.. ‘‘ఈ ఏర్పాటు తుది నిర్ణయం కాదు. అన్ని వర్గాల వారికీ ఆమోదయోగ్యంగా ఉండే సరైన నిర్ణయానికి వచ్చే వరకూ.. కొంతకాలం పాటు తాత్కాలిక ఏర్పాటు మాత్రమే’’ అన్న హామీ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment