Thursday 21 July 2011

telangana kosam delhi lo athma hathya

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఆత్మహత్యలు చేసుకోవటం దేశ రాజధాని ఢిల్లీకి పాకింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన మందాటి యాదిరెడ్డి అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున పార్లమెంటుకు సమీపంలోని శాస్ర్తీ భవన్ వెనుక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని, తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు మాటి,మాటికి అడ్డుపడుతున్నందుకు బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు యాది రెడ్డి ఒక లేఖలో పేర్కొన్నారు. యాది రెడ్డి మృతదేహం వద్ద లభించిన సంచిలో దాదాపు పది విడి పేజీల ఆత్యహత్యకు ముందు రాసిన లేఖ పోలీసులకు లభించింది.
యాది రెడ్డి ఆత్మహత్యా విషయం తెలియగానే రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి వాకబు చేశారు. ఆయన రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి వెళ్లి మృత దేహాన్ని చూడటంతోపాటు హైదరాబాదుకు టెలిఫోన్ చేసి యాదిరెడ్డి బంధువులతో మాట్లాడారు. యాదిరెడ్డి సోదరుడు, మరో ఇద్దరు సన్నిహితులు ఢిల్లీకి వచ్చేందుకు ఆయన ఏర్పాట్లు చేశారు. గురువారం పోస్టుమార్టం జరిగిన అనంతరం యాదిరెడ్డి భౌతికకాయాన్ని ఆయన సోదరునికి అప్పగించి విమానం ద్వారా హైదరాబాదుకు పంపించేందుకు హనుమంతరావు ఏర్పాటు చేస్తున్నారు.
పార్లమెంటుకు సమీపంలోని శాస్ర్తీ భవన్ వెనుక భాగంలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియగానే హుటాహుటిన అక్కడికి వెళ్లామని పార్లమెంటు స్ట్రీట్ పోలీసులు తెలిపారు. చెట్టుకు వేళాడుతున్న యాదిరెడ్డి భౌతికకాయాన్ని వెంటనే రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించామని వారు చెప్పారు. యాదిరెడ్డి భౌతికకాయం వద్ద హిందీ, తెలుగు, ఇంగ్లీష్‌లో రాసిన లేఖ లభించిందని వారు చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఈనెల 17 తేదీలోగా అనుకూల నిర్ణయం తీసుకుంటారని భావించాననీ, కానీ అలా జరగకపోవటంతో తాను ఢిల్లీకి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నానని యాదిరెడ్డి ఆ లేఖలో తెలిపారు. పది పేజీల లేఖలో ప్రతి పేజీపై జైతెలంగాణా అనే నినాదం రాసి ఉన్నది. తన తల్లితో పాటు పలువురికి క్షమాపణలు చెప్పారు.

హనుమంతరావు దిగ్భ్రాంతి
యాదిరెడ్డి ఆత్మహత్య పట్ల హనుమంతరావు దిగ్భ్రాంతి, తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడాలి కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకోటం అర్థరహితమని ఆయన అభిప్రాయపడ్డారు. యువకులు, విద్యార్థులెవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడరాదని ఆయన హితవు పలికారు. ఏఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ కూడా యాదిరెడ్డి ఆత్మహత్య పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర సంఘటని ఆయన చెప్పారు. తెలంగాణ చాలా సున్నితమైన అంశం, భావోద్రేకంతో కూడుకున్నది కాబట్టి అందరు ఆలోచించి వ్యవహరించాలని ఆయన సూచించారు. తెలంగాణతో సహా చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటుపై ఏకాభిప్రాయాన్ని సాధించవలసి ఉన్నదని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment