Monday 25 July 2011

malli mothatikochina telangana

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. విస్త్రృతస్థాయి సంప్రదింపులు, చర్చల తర్వాతే కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఇప్పటికే జరిగిన సంప్రదింపులు, చర్చలను కేంద్రం గాలికొదిలెసింది. మళ్లీ తాజాగా సంప్రదింపులు, చర్చల ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేనట్లేనని కేంద్రం చెప్పకనే చెప్పింది. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ శనివారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మరోసారి సంప్రదింపులు, చర్చల ప్రక్రియ అంశాన్ని లేవనెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై విస్త్రృతస్థాయి సంప్రదింపుల, చర్చలు తర్వాతే కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఇప్పటికే ఈ అంశంపై ఎన్నోసార్లు విస్త్రృతస్థాయిలో సంప్రదింపులు జరిగాయి. చర్చలు ముగిశాయి. అయినా కేంద్ర ప్రభుత్వానికి ఇవేమి సంతృప్తినివ్వలేదు. మళ్లీ తిరిగి సంప్రదింపులు, చర్చలను ప్రారంభించాలని నిర్ణయించింది. సంప్రదింపులు, చర్చల పేరిట కేంద్రం కాలయాపన చేసే మంత్రంగాన్ని రచిస్తోందని తెలంగాణ వాదులు ఆజాద్‌ చేసిన ప్రకటనపై విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్ధలుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి చర్చలు, సంప్రదింపుల పేరిట కేంద్రం దాటవేత ధోరణి తెలంగాణ ప్రజలను మోసగిస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్‌ తొమ్మిదవ తేదీన ప్రకటించిన యుపిఏ సర్కారే తిరిగి మళ్లీ విస్త్రృతస్థాయి సంప్రదింపులు, చర్చలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

అటువంటప్పుడు మరి డిసెంబర్‌తొమ్మిదవ తేదీ ప్రకటన ఎందుకు చేసిందని ప్రశ్నించారు. డి సెంబర్‌ తొమ్మిదవ తేదీ తరువాత రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి అన్ని వర్గాల వారితో, సంఘాలు, రాజకీయ పార్టీలతో విస్త్రృతస్థాయి సంప్రదింపులు జరిపి కేంద్రానికి నివేదిక అందజేసిందన్నారు. అంతకు మించి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎవ్వరితో సంప్రదింపులు జరుపుతుందని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాల నేపథ్యంలో కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడితో తప్పనిసరిగా ఎదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల నుండి తప్పించుకునేందుకే కేంద్రం సంప్రదింపులు, చర్చల ప్రస్తావనను తెరమీదకు తీసుకువచ్చిందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఒత్తిడితోనే ఈ ప్రకటన చేసిందని తెలంగాణ వాదులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై మరికొంత కాలం సంప్రదింపులు, చర్చల పేరిట కాలయాపన చేస్తే ఉద్యమం నీరుగారిపోతుందని కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉండవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనావేస్తున్నారు.

కేంద్రం నిర్ణయం ద్వారా సమీప భవిష్యత్తులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభానికి నోచుకునే అవకాశాలు ఎంత మాత్రం లేవంటున్నారు. ఉద్యమాల వల్ల అభివృద్ధి కుంటుపడడం మినహా కేంద్రం ఏమాత్రం స్పందించినట్లుగా కనిపించడం లేదంటున్నారు. ప్రజాప్రతినిధుల రాజీనామాలు సైతం కేంద్రంపై పెద్దగా ప్రభావం చూపినట్లుగా కనిపించడం లేదంటున్నారు. దీనికంతటికి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో రాజీనామాలు చేయకపోవ డమే కారణమని పేర్కొంటున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత టీ-కాంగ్రెస్‌ నేతల స్వరం మారిందన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువద్దామనే మాటను ప్రయోగించడానికి వారు ఎంత మాత్రం ఇష్టపడడం లేదన్నారు.

కాంగ్రెస్‌ అధిష్టానం ఒత్తిడితో టీ-కాంగ్రెస్‌ నేతలు మెత్తబడినట్లుగానే కనిపిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం మంత్రి గులాం నబీ ఆజాద్‌ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ గుండుగుత్తగా టీ-ప్రజాప్రతినిధుల రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడం వెనుక కేంద్ర ప్రభుత్వ నిర్ణయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంకాన్ని మరికొంతకాలం సంప్రదింపులు, చర్చల ప్రక్రియ ద్వారా సాగదీయాలని కేంద్రం యోచి స్తున్నట్లు తెలుస్తోందంటున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పట్లో తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అంశం మళ్లీ ‘రెడ్డొచ్చె మొదలా యో’ అన్న చందంగా తయారయిందంటున్నారు.

No comments:

Post a Comment