అక్కడి నుంచి మాకు ఒక్క ఎంపీ కూడా లేడు..
అయినా విపక్ష బాధ్యతగా దాన్ని ప్రస్తావిస్తున్నా
శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై గోప్యతెందుకు?
‘డిసెంబర్ 9’ ప్రకటనకు కేంద్రం కట్టుబడాల్సిందే
యాదిరెడ్డి ఆత్మహత్యను ప్రస్తావించి..
సూసైడ్ నోట్‌ను లోక్‌సభలో చదివిన సుష్మ
తెలంగాణ కోసం బలిదానాలొద్దంటూ తెలుగులో విజ్ఞప్తి
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే బీజేపీ మద్దతిస్తుందని లోక్‌సభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్ పునరుద్ఘాటించారు. ‘‘ఈ విషయంలో సంప్రదింపులు చాలా అయ్యాయి. ఇకనైనా బిల్లుపెట్టాలి. మూడింట రెండొంతుల మద్దతు లభించేలా చూస్తాం’’ అన్నారు. ‘డిసెంబర్ 9’ ప్రకటనకు కట్టుబడాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో, రాష్ట్ర అసెంబ్లీలో తగ్గుతున్న తెలంగాణ గొంతుకను గట్టిగా విన్పించేందుకే సావధాన తీర్మానం పెట్టామని శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. తెలంగాణలో ఆత్మహత్యలు ఆగాలంటూ సభ పిలుపునివ్వాలని కోరారు. ‘‘తెలంగాణ చరిత్ర ఉద్యమాలు, విశ్వాస ఘాతుకాలతో నిండిపోయింది. వారిప్పటికీ స్వాతంత్య్ర సంబరాలు చేసుకోలేకపోతున్నారు. వారి నెత్తిన కత్తి వేలాడుతోంది’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం బలిదానాలొద్దని, రాష్ట్రాన్ని చూసేందుకు బతకాలని తెలుగులో విజ్ఞప్తి చేయడం విశేషం!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తన ‘ప్రియమైన అంశం’గా సుష్మ అభివర్ణించారు. తెలంగాణపై తాము తొలిసారిగా మాట్లాడడం లేదని, ఆ ప్రాంతం నుంచి బీజేపీకి ఒక్క ఎంపీ కూడా లేకపోయినా విపక్ష బాధ్యతగా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నామని చెప్పారు. ‘‘తెలంగాణ ప్రజలు వ్యతిరేకించినా విలీనం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ముల్కీ నిబంధన, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఫార్ములా నంబర్ 6, 610 జీవో, గిర్‌గ్లానీ కమిషన్ వంటివెన్ని చేసినా ఆచరణలో విఫలమయ్యాయి. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ సమయంలో కరీంనగర్ సభలో ఇచ్చిన హామీని విశ్వసించి ప్రజలు ఓట్లేశారు.
తర్వాత ప్రభుత్వంలోనూ టీఆర్‌ఎస్ భాగస్వామి అయింది. సరైన సమయంలో, సంప్రదింపులు, ఏకాభిప్రాయంతో తెలంగాణ ఏర్పాటు చేస్తామని యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ చెప్పారు. 2009 కూడా వెళ్లిపోయింది గానీ తెలంగాణ ఏర్పాటుకు మాత్రం సరైన సమయం రాలేదు’’ అంటూ పదునైన విమర్శలు చేశారు. యూపీఏ-2 పాలనలో రాష్ట్రపతి ప్రసంగంలో ఏకాభిప్రాయం అంశాన్నీ ఎత్తేశారని ధ్వజమెత్తారు. 2009లో తెలంగాణ నుంచి 12 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా రాష్ట్రం ఏర్పాటులో ఏ పురోగతీ లేదన్నారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష అంశాన్ని 2009 డిసెంబర్ 7న మేం సభలో లేవనెత్తాం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని డిసెంబర్ 9న కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనను సోనియా జన్మదిన కానుకగా భావించి అక్కడి వారంతా సంబరాలు చేసుకున్నారు. ఆ ప్రకటన తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందనుకున్నారు. కానీ 14 రోజుల్లోనే చిదంబరం మాట మార్చారు. సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయంతోనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమంటూ డిసెంబర్ 23న ప్రకటన చేశారు’’ అని దుయ్యబట్టారు.
శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణకు అన్యాయమే చేసిందని సుష్మ అనడంతో, ఇది సావధాన తీర్మానమంటూ స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ముఖ్యమైన విషయాలు చెప్పదలచానంటూ సుష్మ కొనసాగించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారని చిదంబరాన్ని ప్రశ్నించారు. మీడియా, పొలిటికల్ మేనేజ్‌మెంట్ ఎలా చేయొచ్చో అందులో సూచించారని సభ దృష్టికి తెచ్చారు. తెలంగాణపై అనేక మోసాలు జరుగుతుండడంతో 600 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇటీవల ఢిల్లీలో యాదిరెడ్డి ఆత్మబలిదానాన్ని ప్రస్తావించారు.
ఆయన ఆత్మహత్య లేఖలోని ముఖ్యాంశాలను చదివి విన్పించారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యానికి కారణాలు, పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను సభకు తెలపాలని చిదంబరాన్ని కోరారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు, నివేదిక, ఆరు సిఫార్సులు, వాటిపై పార్టీలతో అఖిలపక్ష భేటీ తదితరాలను ఆయన వివరించారు. సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 14 (ఎఫ్)పై తాజా పరిస్థితులను వివరించారు.
తెలంగాణ కోసం ఆ ప్రాంత ఎంపీలు రాజీనామా చేశారని సుష్మ చెబుతుండగా, ‘‘అంతా రాజీనామా చేశారని ఎలా చెబుతారు? కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, ఎంపీలు అంజన్‌కుమార్, సర్వే సత్యనారాయణ చేయలేదు’’ అంటూ కావూరి అభ్యంతర పెట్టారు. దాంతో నలుగురు రాజీనామా చేయలేదంటూ ఆమె సవరించుకున్నారు. ‘‘17 మంది తెలంగాణ ఎంపీల్లో 13 మంది; 119 మంది ఎమ్మెల్యేల్లో 103 మంది ఆవేదనలతో రాజీనామా చేశారు. అల్లరి పిల్లవానికి అమాయకపు అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తున్నామని, కలిసుండలేకపోతే విడిపోవాలనిఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసేప్పుడే తొలి ప్రధాని నెహ్రూ అన్నారు’’ అని పేర్కొన్నారు.
సీమాంధ్ర ఎంపీలు అభ్యంతరం తెలపడంతో సర్వే సత్యనారాయణకు, వారికి వాగ్వాదం జరిగింది. వారికీ మాట్లాడేందుకు సమయమిస్తానంటూ స్పీకర్ సముదాయించారు. ‘‘నేనేమీ ఏ బీజేపీ నేతో చేసిన వ్యాఖ్యలను చెప్పడం లేదు. నెహ్రూ వ్యాఖ్యలనే ప్రస్తావిస్తున్నా. మీరెందుకు అంత బాధపడుతున్నారు? అవి 1956, మార్చి 6న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో ప్రచురితమయ్యాయి’’ అని సుష్మ వివరించారు. ‘‘సోదర సోదరీమణులారా..! తెలంగాణ కోసం ఆత్మబలిదానం వద్దు. తెలంగాణ చూడటానికి బతకాలి’’ అంటూ ఆమె ప్రసంగాన్ని తెలుగులో ముగించారు!
No comments:
Post a Comment