ఖమ్మంతెలంగాణ సాధనలో భాగంగా ఉద్యోగ జేఏసీ నిర్వహించ తలపెట్టిన ఆందోళలనల్లో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఐ ఎంఎల్, బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు మద్దతును ప్రకటించాయి. పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో జరిగిన దీక్షలకు రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం ప్రకటించారు.
కొత్తగూడెంలో జరిగిన దీక్షలలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాబంశివరావు, పాల్వంచలో జరిగిన దీక్షలకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావులు సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగిన దీక్షల్లో ఉద్యోగులు ఎస్మా జీవో ప్రతులను దహనం చేశారు. ఈ దీక్షల్లో జిల్లాలోని ఆయా ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయి.
నాలుగున్నర కోట్ల ఆకాంక్ష నెరవేరబోతోంది...
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష త్వరలో నెరవేర బోతోందని మంత్రి రాంరెడ్డి అన్నారు. కూసుమంచిలో జరిగిన దీక్షల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం మరలా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
సాధ్యమైనంత త్వరలో తెలంగాణ వస్తుందని, ఈమేరకు టీ కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారన్నారు. చర్చల అనంతరం ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ కోసం నాలుగున్నర కోట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారని , వారి ఆకాంక్ష నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సీమాంధ్రు లు రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని వారి ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఇక్కడి వారు నిజమైన ఉద్యమ సారథులని కితాబిచ్చిన మంత్రి, తెలంగాణ అమర వీరుల త్యాగాలు వృథా కావన్నారు..
భయపడేది లేదు....
దీక్షల్లో పాల్గొన్న జేఏసీ నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఎస్మా చట్టం ప్రయోగిస్తామని బెదిరిస్తే భయపడేది లేదన్నారు. ఉడుత ఊపులకు మహావృక్షం ఊగదని, తెలంగాణ ఉద్యోగుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు.
ఈ దీక్షలల్లో జై తెలంగాణ , జైజై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి సీమాంధ్రులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సీఎం కూడా వారికి వంత పాడుతూ సీమాంధ్ర బుద్ధి చూపిస్తున్నారని విమర్శించారు.
అత్యవసర సర్వీసుల పేరుతో కీలకమైన ప్రభుత్వ శాఖల ఉద్యోగులను ఈనెల 17 నుంచి జరిగే సకల జనుల సమ్మెకు వెళ్ళకుండా చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. అందులో భాగంగానే ఎస్మా చట్టం పేరుతో బెదిరిస్తున్నాడని, ఆయనకు ఉద్యోగుల చేతుల్లో పతనం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు మరల రాజీనామాలు చేసి ఆమోదింపచేసుకోవాలని, గతంలో రాజీనామా చేయని వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఉగ్రరూపం చూపక ముందే ప్రభుత్వాలు తెలంగాణ ప్రకటించాలని, లేకుంటే ఇక్కడి సీమాధ్రులను ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని అన్నారు.
ఈ ఆందోళనల్లో జేఏసీ చైర్మన్ కనకాచారి, ఉద్యోగ జేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, ఖాజామియా, టీజీవో ప్రదాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, సంగం వెంకటనర్సయ్య, బత్తుల సోమయ్య, మనోహర్, విజయ్ శ్రనివాసరావు, వెంకటేశ్వర్లు, భద్రయ్య వెంకటరెడ్డి, ప్రభాకర్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment