Saturday, 6 August 2011

telangana issue meere thelchukovali chidambaram(మీరే తేల్చుకోవాలి చిదంబరం)

తెలంగాణా.. సమైక్యాంధ్రా?... తెలుగు ప్రజలే పరిష్కరించుకోవాలి
చేతులు దులుపుకున్న చిదంబరం
ఆ పరిష్కారాన్ని అమలు చేయటం మాత్రమే కేంద్రం, పార్లమెంటు చేయగలవు
రాష్ట్ర ప్రజలను చీల్చింది నేను కానీ, కేంద్రం కానీ కాదు.. వారే చీలిపోయారు
హైదరాబాద్ అఖిలపక్ష సమావేశం మినిట్స్ ఆధారంగానే ‘డిసెంబర్ 9’ ప్రకటన
ఆ ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితి మారిపోయింది.. కేంద్రం దానిని గుర్తించింది
ఆ నేపథ్యంలోనే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది.. నివేదికలో ఏం రాయాలో మేం చెప్పలేదు
రాష్ట్రంలో 8 గుర్తింపు పొందిన పార్టీల్లో.. 4 పార్టీలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు
అన్ని పార్టీలూ ఒక స్పష్టమైన నిర్ణయంతో వస్తేనే.. మళ్లీ అఖిలపక్ష సమావేశం సాధ్యం
లోక్‌సభలో బీజేపీ సావధాన తీర్మానానికి కేంద్ర హోంమంత్రి జవాబు

ప్రత్యేక తెలంగాణ - సమైక్యాంధ్ర ఉద్యమాలతో రగులుతున్న రాష్ట్ర సమస్యకు పరిష్కారం ఏమిటో.. తెలుగు ప్రజలే చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. శుక్రవారం లోక్‌సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్ తెలంగాణపై ప్రవేశపెట్టిన సావధాన తీర్మానానికి కేంద్ర హోంమంత్రి చిదంబరం సమాధానం ఇస్తూ.. ఈ సమస్యను తెలుగు ప్రజలు పరిష్కరించుకుంటే కేంద్ర ప్రభుత్వం దానిని అమలు చేస్తుందని చెప్పారు. ఈ అంశంపై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలతో సహా నాలుగు పార్టీలు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదన్నారు. అవి కూడా ఒక అభిప్రాయంతో ముందుకు వస్తేనే అఖిలపక్ష సమావేశం ఉంటుందన్నారు. అంతకుముందు.. సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ.. కేంద్రం 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే.. మూడింట రెండు వంతుల మద్దతు లభించేలా చూస్తామన్నారు. మరోవైపు.. తీర్మానం నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల మధ్య సభలో తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వీరందరినీ నియంత్రించేందుకు స్పీకర్‌తో పాటు.. కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయాస పడాల్సి వచ్చింది.
ఒకే రాష్ట్రంగా కలిసి ఉండటమో, విడిపోవటమో అన్న సమస్యను తెలుగు ప్రజలే తేల్చుకోవాలని చెప్తూ.. కేంద్ర ప్రభుత్వం భారమంతా రాష్ట్ర ప్రజలపైకి నెట్టేసింది. ‘‘తెలంగాణ డిమాండ్ ఒకవైపు, సమైక్యాంధ్రప్రదేశ్‌నే కొనసాగించాలన్న డిమాండ్ మరోవైపు ఉండటంతో తలెత్తిన సమస్యకు పరిష్కారం.. తప్పనిసరిగా తెలుగు మాట్లాడే ప్రజల నుంచే రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచే (పరిష్కారం) రావాలి. కేంద్రం ఆ పరిష్కారాన్ని అమలు చేయగలదంతే’’ అని కేంద్ర హోంమంత్రి చిదంబరం.. బంతిని రాష్ట్ర ప్రజల కోర్టులోకి నెట్టేసి చేతులు దులుపుకున్నారు. సంక్లిష్టమైన ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం కృషిచేస్తోందని ఇన్నాళ్లుగా చెప్తూ వచ్చిన ఆయన.. ఇప్పుడీ సమస్యతో తనకు కానీ, కేంద్రానికీ కానీ సంబంధం లేదని పార్లమెంటు వేదికగా పేర్కొన్నారు. వివాదాన్ని తెలుగు ప్రజలే శాంతియుతంగా పరిష్కరించుకోవాలంటూ.. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను చీల్చింది తానో, కేంద్ర ప్రభుత్వమో కాదని.. రాష్ట్రంలో తలెత్తిన ప్రస్తుత పరిస్థితులకు తమ బాధ్యత ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ‘‘చీలిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. అక్కడి పార్టీలు.. దీనితో మాకే సంబంధమూ లేదు’’ అని నిండు సభలో వక్కాణించారు. రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన పార్టీల్లో.. అధికార, ప్రతిపక్షాలతో సహా 4 పార్టీలు తెలంగాణపై నిర్ణయానికి రాలేదని చెప్పారు. ఆ పార్టీలు నిర్ణయానికి వస్తే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు.

శుక్రవారం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ ఇచ్చిన సావధాన తీర్మానంపై.. పలువురు నాయకులు ఉద్వేగభరితంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాల హామీలను ప్రస్తావిస్తూ సుష్మ సుదీర్ఘంగా మాట్లాడాక.. కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు సర్వే సత్యనారాయణ, కావూరి సాంబశివరావులు ఆవేశంగా మాట్లాడారు. ఒక సందర్భంలో వారిద్దరి ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఇరు ప్రాంతాల సభ్యులు వారికి మద్దతుగా కేకలు వేయటంతో పరిస్థితి తీవ్ర గందరగోళానికి దారితీసింది. వీరిని శాంతింపచేయటానికి.. ప్రభుత్వ పెద్దలు చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. వారు శాంతించాక చిదంబరం.. తీర్మానానికి సమాధానం చెప్పారు. ‘‘నేను చాలా విచారంతో మాట్లాడుతున్నా. నేను భయపడ్డట్లే ఈ సావధాన తీర్మానం.. సభలో చీలికతెచ్చే చర్చగా మారింది. దయచేసి.. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు చీలిపోయి ఉన్నారన్న విషయాన్ని అర్థంచేసుకోండి. అక్కడ ఉద్వేగాలను రెచ్చగొట్టే విధంగా పార్లమెంటులో ఎలాంటి వ్యాఖ్యలు కానీ, పని కానీ చేయకూడదు’’ అని పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

‘‘ఈ సమస్యకు పరిష్కారం తెలుగు మాట్లాడే ప్రజల నుంచే రావాలని ఆంధ్రప్రదేశ్ నాయకులకు చెప్పేందుకు నేను ఆది నుంచీ ప్రయత్నిస్తున్నాను. నిజానికి 2010 జనవరి 5వ తేదీన, 2011 జనవరి 6వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశాలకు హాజరైన వారికి తెలుసు.. నేను ఈ విషయాన్ని పదేపదే చెప్పా.. పరిష్కారం నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచే రావాలి. పార్లమెంటు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆ పరిష్కారాన్ని అమలు మాత్రమే చేయగలవు. తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉందన్న సుష్వాస్వరాజ్ మాటలతో నేను ఏకీభవిస్తున్నా. అయితే.. దీనికి సంబంధించి ఇటీవలి చరిత్రను కూడా విస్మరించకూడదు. ఆ సంఘటనలను పరిగణనలోకి తీసుకోకపోతే.. కేంద్ర ప్రభుత్వం ఎందుకింత ఎక్కువ జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరిస్తోందో అర్థంచేసుకోవటం కష్టమవుతుంది.

ఆ ప్రకటన తర్వాత అంతా మారిపోయింది..

2009 డిసెంబర్ 7న హైదరాబాద్‌లో బీఏసీ సమావేశం, ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం జరిగాయి. ఆ సమావేశాల మినిట్స్ ఆధారంగానే.. కేంద్ర ప్రభుత్వం నా ద్వారా డిసెంబర్ 9 ప్రకటన చేసింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా, ప్రభుత్వ నేతలు నిర్ణయం తీసుకోకుండా.. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఆ ప్రకటన చేయగలరని నమ్మేంత అమాయకులెవరూ లేరని నేను నిజంగా ఆశిస్తున్నా. కానీ.. డిసెంబర్ 9న ఆ ప్రకటన చేసిన అనతికాలంలోనే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మారిపోయింది. అది నిరాకరించలేని సత్యం. ఆంధ్రప్రదేశ్‌లో పాలక పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చీలిపోయాయి. నేను వాటిని చీల్చలేదు. ఈ సభలోని ఏ ఒక్కరూ అవి చీలిపోవాలని కోరుకోరు. కానీ అవి చీలిపోయాయన్నది నిజం. అవి చీలిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ వాస్తవాన్ని గుర్తించక తప్పని పరిస్థితి వచ్చింది. మారిన పరిస్థితిని గుర్తించి.. మేం డిసెంబర్ 23న ప్రకటన చేశాం. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ప్రతి ఒక్కరినీ సంప్రదించింది. కేంద్ర ఆర్థిక మంత్రిని, నన్నూ సంప్రదించింది. కానీ.. కమిటీ నివేదికలో ఏం రాయాలో మేం చెప్పలేదు. ఇలా చేయి, అలా చేయి.. ఇది రాయి, అది రాయి అని చెప్పటం ప్రభుత్వంలోని మంత్రుల పని కాదు. కమిటీ ఒక నివేదిక రాస్తే.. దాని రచయితలు వారే. అందులో వారు రాసిన దానికి వారే బాధ్యత తీసుకుంటారు. జస్టిస్ శ్రీకృష్ణ వంటి న్యాయమూర్తిని ఎవరూ తప్పుపట్టకూడదు. ఆయన మార్గదర్శక సూత్రాలకు కట్టుబడ్డారు. ఆయన తన నివేదికలో 8వ చాప్టర్‌ను రహస్యంగా ఉంచాలని ఎందుకు చెప్పారో నేనెలా చెప్పగలను? ఆ చాప్టర్ విషయమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ చాప్టర్‌ను బహిర్గతం చేయలేను.’’

పార్టీలు తరచూ వైఖరి మార్చుకుంటుంటాయి

రాజకీయ పార్టీలు తరచూ తమ వైఖరిని మార్చుకుంటుంటాయని చిదంబరం అన్నారు. ‘బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు తెలంగాణ విషయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయటం కుదరదని, ప్రాంతీయ వెనుకబాటుతనానికి అభివృద్ధే పరిష్కారమని అప్పటి హోంమంత్రి అద్వానీ 2002 ఏప్రిల్ ఒకటో తేదీన స్పష్టంచేశారు. ఇప్పుడు ఆ పార్టీ వైఖరి మారింది. దానిని నేను తప్పుపట్టటం లేదు. రాష్ట్రంలో 8 గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి. వాటిలో పీఆర్‌పీ.. తను కాంగ్రెస్‌లో విలీనం అవుతున్నట్లు ప్రకటించింది. పార్టీల సంఖ్య 7కు తగ్గింది. అయితే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అనే మరో కొత్త పార్టీ వచ్చింది. అంటే రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీల సంఖ్య 8 గానే ఉంది. ఈ 8 పార్టీల వైఖరి ఏమిటి? బీజేపీ, టీఆర్‌ఎస్, సీపీఐ.. మూడు పార్టీలు స్పష్టంగా తెలంగాణ ఏర్పాటును కోరుతున్నాయి. ఒక పార్టీ.. సీపీఎం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తోంది. మరో మూడు పార్టీలు.. బహుశా ఎనిమిదో పార్టీ కూడా.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. తాము ఇంకా తుది నిర్ణయానికి రాలేదని కాంగ్రెస్ చెప్పింది. వారు ఇంకా సంప్రదింపుల ప్రక్రియలోనే ఉన్నారు. టీడీపీ చీలిపోయి ఉంది. ఒక పార్టీగా తాము తుది నిర్ణయం తీసుకోలేదని వారు నాతో చెప్పారు.

ఇక ఎంఐఎం.. తాము నిర్ణయం తీసుకునే ముందు.. కాంగ్రెస్, టీడీపీల నిర్ణయాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు నాతో చెప్పారు. కొత్త పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.. తుది నిర్ణయం తీసుకోవటం గురించి నాతో ఏమీ చెప్పలేదు. నాకు అందిన నివేదికల ప్రకారం.. నెల కిందట వారు నిర్వహించిన సదస్సులో.. తుది నిర్ణయం తీసుకోలేదు. ఇంకా 4 పార్టీలు స్పష్టమైన వైఖరి తీసుకోనందున నేను చేయగలిగిందీ ఏమీ లేదు. మేం ఆ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. దయచేసి మీ సంప్రదింపుల ప్రక్రియను పూర్తిచేయండి. అన్ని పార్టీలూ స్పష్టమైన అభిప్రాయంతో ముందుకు వస్తేనే.. తదుపరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు సాధ్యమవుతుంది. ఇందుకు రెండు మూడు వారాలు పట్టొచ్చు.. రెండు మూడు నెలలూ పట్టొచ్చు. ఈ ప్రక్రియ పూర్తవటానికి వీలుకలిగేలా తెలుగు ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు.

ఎవరూ చనిపోకూడదు..

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు ఢిల్లీకి వచ్చి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు. ‘‘అది ఆత్మహత్యా కాదా, మృతుడు రాసినట్లు చెప్తున్న సూసైడ్ నోట్ వాస్తవమైనదా కాదా అన్న అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మరణం మనల్ని చాలా బాధపెడుతుంది. మన యువకుల్లో ఒకరు.. కారణమేదైనా, ఏ కారణంతో, ఏ ఉద్వేగంతో, ఏ నిరాశతో, ఏ ఆగ్రహంతో ప్రేరేపితమైనా.. అతడు ఆత్మహత్య చేసుకుంటే.. అది మనలో ప్రతి ఒక్కరినీ బాధపెడుతుంది. మేం చర్చిస్తూ ఉండగా.. దయచేసి ఇలాంటి తీవ్ర చర్యలకు పాల్పడవద్దని మనమందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేయాలన్నది నా వినతి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మా సొంత పిల్లల వంటివారు. ఈ సమయంలో ఏ ఒక్కరూ లాఠీచార్జిల్లో గాయపడకూడదు. ఎవరూ చనిపోకూడదు. మేం ఒక నిర్ణయానికి వచ్చే వరకూ.. 12 కోట్ల మంది తెలుగు ప్రజలు, ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు శాంతిసహనాలతో ఉండాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment