Saturday, 6 August 2011

loksabha lo Garginchina Sushma Swaraj

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంశంపై శుక్రవారం నాడు లోక్‌సభ దద్దరిల్లిపోయింది. వాద ప్రతివాదాలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు.. విమర్శలతో హోరెత్తిపోయింది. కుటిల సమైక్యవాదం.. లోక్‌సభ సాక్షిగా పటాపంచలైంది. అడ్డగోలు వాదన మినహా సూటిగా సమాధానాలు చెప్పలేని దైన్యంలో సీమాంవూధవాదం చిన్నబోయింది. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత యావత్ భారతానికి చేరింది. మొట్ట మొదటిసారిగా తెలంగాణపై సుదీర్ఘ చర్చకు లోక్‌సభ వేదికైంది. తెలంగాణ ఆర్తిని, ఆత్మబలిదానాలను, రాష్ట్రం ఏర్పాటు అవసరాన్ని భారతజాతికి కళ్లకు కట్టినట్లు తెలియజెప్పడంలో తెలంగాణ ఆడబిడ్డ పాత్ర సమర్థంగా పోషించి, వూపతిపక్ష నేత సుష్మాస్వరాజ్ విజయవంతమయ్యారు. అటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సర్వే సత్యనారాయణ సైతం తెలంగాణ నా జన్మహక్కు అంటూ తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ స్థాయిలో గట్టిగా వినిపించారు.

తెలంగాణకు అడుగడుగునా జరిగిన అన్యాయాలను సవివరంగా ప్రస్తావించిన సుష్మ.. వివిధ ఒప్పందాలు ఉల్లంఘనకు గురైన తీరును ఎండగట్టారు. తాజా శ్రీకృష్ణ కమిటీ బండారాన్ని బయటపెట్టారు. నిక్కచ్చిగా.. ముక్కుసూటిగా సుష్మ చేసిన ప్రసంగంతో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి కావూరి సాంబశివరావు బిత్తర పోయారు. హోం మంత్రి చిదంబరం సమాధానాలు వెతుక్కునే పనిలో పడిపోయారు. చివరికి కొత్తగా ఏమీ చెప్పలేకపోయారు. పాత పాటలనే వల్లెవేశారు. ఓ దశలో సుష్మ ప్రసంగంతో కంగుతిన్న చిదంబరం.. తమ చేతిలో ఏమీ లేదని, తేల్చుకోవాల్సింది ఆంధ్రవూపదేశ్‌లోని రాజకీయ పార్టీలేనని పాత మాటలనే పునరుద్ఘాటించారు. తమ పార్టీలోనూ ఏకాభివూపాయం లేదని ఒప్పుకున్నారు.

సుష్మ మాట్లాడుతుంటే కావూరి సాంబశివరావు ఆమెకు అడుగడుగునా అడ్డుపడి అడ్డదిడ్డమైన వాదన చేశారు. కానీ.. ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు. రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ కూడా లేని బీజేపీ తెలంగాణ గురించి మాట్లాడటమేంటన్న కావూరి వాదనను సుష్మ దీటుగా తిప్పి కొట్టారు. కేంద్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మాట్లాడుతున్నామని చెప్పారు. గతంలోనూ తెలంగాణ కోసం మాట్లాడింది తామేనని చెప్పారు. కావూరికి బాసటగా మరో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేకి లగడపాటి నిలిచినా.. సుష్మ వాగ్ధాటితో మిన్నకుండిపోయారు. అర్థవంతమైన చర్చ జరగలేదని చిదంబరం తేల్చినా.. తెలంగాణపై కాంగ్రెస్ కచ్చితమైన నిర్ణయానికి రాలేదన్న వాస్తవం బయటపడింది. దీంతో ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన నేతలు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలన్న ఒత్తిడి రావచ్చునన్న వాదన వినిపిస్తున్నది. పార్టీకి విధేయతతో ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమవుతామంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదని పలువురు తెలంగాణవాదులు అంటున్నారు.

మొత్తం మీద మూడు నెలల్లో చర్చల ప్రక్రియను ముగిస్తామని చిదంబరం ప్రకటించడంతో సావధాన తీర్మానం లక్ష్యం కొంతలో కొంత నెరవేరిందనే చెప్పొచ్చు. చిదంబరం ప్రకటన నేపథ్యంలో మరో మూడు నెలల్లోగా తెలంగాణపై ఒక నిర్ణయం వెలువడుతుందనే ఆశ ప్రజాస్వామ్యవాదుల్లో, తెలంగాణ ప్రజల్లో నెలకొంది. అటు తెలంగాణపై పార్లమెంటులో గంటన్నర పాటు సాగిన చర్చ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపనుండటంతో అధికార పార్టీ కొంత ఆత్మ రక్షణలో పడింది. తెలంగాణపై నిర్ణయం వెలువరించే ముందు రాష్ట్రంలో జరిగే లాభ నష్టాలను మాత్రం బేరీజు వేసుకుంటున్న అధికార పార్టీ, తాజా విస్తృత చర్చ అనంతరం తన పరిధిని విస్తరించుకోవచ్చన అభివూపాయం వినిపించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. రాజకీయ అవసరాల కోసం వాటిని తుంగలో తొక్కిందనే వాస్తవం చర్చ ద్వారా బహిరంగమవడంతో దేశ వ్యాప్తంగా ఆ పార్టీపై విశ్వసనీయత సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. పైగా ఇకపై కాంగ్రెస్ చేసే వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉండబోదు.

ఆ దిశలోనే బీజేపీ చేసిన కృషి ఫలించిందని నిపుణులు అంటున్నారు. లోక్‌పాల్, ధరల పెరుగుదల, అవినీతిపై ప్రభుత్వాన్ని పెద్దగా ఇరుకున పెట్టలేక పోయిన బీజేపీ, తెలంగాణపై జరిగిన చర్చలో మాత్రం పై చేయి సాధించింది. అన్ని విషయాల్లో ప్రతిపక్షాల్లో చీలిక తెచ్చే అధికార పార్టీ తెలంగాణ విషయంలో మాత్రం పార్లమెంటు సాక్షిగా తానే చీలిపోయింది. సొంత పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులను కట్టడి చేయలేక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్, హోం మంత్రి చిదంబరం తలపట్టుకున్నారు. పార్లమెంటు గత సమావేశాల్లో నిరసన తెలిపిన టీ ఎంపీలను బెదిరించి బయటకు పంపిచినవూపణబ్ ఇప్పుడు మాత్రం సీమాంధ్ర నాయకుల పట్ల ఉదాసీనత ప్రదర్శించారు. సీమాంధ్ర ఎంపీలు కావూరి, లగడపాటి, ఆనంత, రాయపాటి, సబ్బం హరి తదితరులు చర్చకు ఆడుగడుగునా అడ్డుతగిలారు.

సావధాన తీర్మానంపై చర్చకు అనుమతిస్తున్నానని స్పీకర్ ప్రకటించిన వెను వెంటనే కావూరి లేచి నిలబడి ‘‘రాష్ట్రం గురించి వాస్తవాలు, గణాంకాలు తెలియని సుష్మ.. రాజకీయ కారణాలతోనే తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు’’ అని ప్రతిపక్ష నాయకురాలిని అవమాన పరిచే విధంగా వ్యవహరించారు. తామంతా చర్చకు అనుమతివ్వాలని ఎన్నిసార్లు కోరినా నిరాకరించి, బీజేపీకి అవకాశం ఎలా ఇస్తారని స్పీకర్ అధికారాన్నే ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అడ్డు తగలొద్దని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రశాంతంగా చర్చ జరగకుండా సీమాంధ్ర ఎంపీలు తీవ్రంగా ప్రయత్నించారు. రాష్ట్రం నుండి ఒక్క ఎంపీలేని బీజేపీ తెలంగాణ గురించి మాట్లాడటం దయనీయం.... రాష్ట్రంలో రెండు శాతం ఓటు బ్యాంకు లేని పార్టీకి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదు.. అంటూ సుష్మ ప్రసంగిస్తుండగానే రన్నింగ్ కామెంటరీలకు దిగారు.

మాట్లాడటానికి అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా.. తెలంగాణ విషయంలో తమ వైఖరి తప్ప మరో వైఖరి వినిపడకూడదనే తీరుగా ప్రవర్తించారు. అమరుడైన యాదిడ్డి ఆత్మహత్య లేఖలోని అంశాలను సభ దృష్టికి తేవాలని సుష్మాస్వరాజ్ ప్రయత్నిస్తుంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి లేఖ ఆయన వ్యక్తిగతమని, దాన్ని మీరెలా చదువుతారని కావూరి అభ్యంతరం పెట్టారు. యాదిడ్డి రాసిన లేఖ ఆయన రాసిందేనా? అన్న విషయం తేలాల్సి ఉందని అమరులను చులకన చేసి మాట్లాడారు. ఇక తమ పార్టీ ఎంపీ సర్వే సత్యనారాయణ మాట్లాడుతుండగా తెలంగాణ కోసం అందరూ రాజీనామాలు చేస్తే నువ్వేందుకు సభకొచ్చావంటూ వెటకారాన్ని ప్రదర్శించారు. ‘తెలంగాణ కోసం పార్లమెంటులో ఆత్మహత్య చేసుకుంటానన్నావు కదా’ అంటూ తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆత్మహత్యలే శరణ్యం అన్న విధంగా వ్యవహరించారు.

తెలంగాణకు మద్దతిస్తున్నా... ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలను గౌరవిస్తున్నానని గురుదాస్ దాస్ గుప్తా చెప్పినపుడు వీరావేశంతో బల్లలు చరిచిన సీమాంధ్ర ఎంపీలు ఆంధ్రా ప్రాంతం మొత్తం ఆగం కావొద్దనే అర్థంతోనే ఆయా ప్రాంతాను గౌరవిస్తున్నానని గురుదాస్ పేర్కొనడంతో చిన్నబుచ్చుకున్నారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకే సమైక్య రాష్ట్రం కోసం పాటు పడుతున్నామని అసత్యాలు పలికే సీమాంధ్ర నాయకులు, అక్కడి ప్రజలు బాగుండాలని ఎవరైనా కోరుకుంటే మాత్రం బల్లలు చరచలేని దైన్యంలో పడిపోయారు. చివరిలో మాట్లాడిన చిదంబరం.. తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. బంతిని రాష్ట్ర పార్టీల కోర్టుల్లోకి నెట్టారు. తెలంగాణ అంశంలో ముందుగా నిర్ణయం తీసుకోవాల్సింది ఆయా పార్టీలేనని తేల్చారు.

రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది ప్రధాన పార్టీల్లో నాలుగుకుపైగా పార్టీలు తెలంగాణపై తమ వైఖరిని ఇంత వరకూ ఖరారు చేసుకోలేదని చెప్పారు. ‘‘ఈ సమస్యకు పరిష్కారం తెలుగు మాట్లాడేవారి నుంచి, ఆంధ్రవూపదేశ్ ప్రజల నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను ముందుకు తీసుపోవటమే చేయగలదు. పార్లమెంటు కూడా ఆ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడమే చేయగలదు’’ అని చిదంబరం చేతుపూత్తేశారు. బీజేపీ సభ్యులు గోపీనాథ్ ముండే, రమేష్ కూడా చర్చలో పాల్గొనాల్సి ఉన్నా వారు ఉపసంహరించుకున్నారు.

No comments:

Post a Comment