Thursday, 15 September 2011

vudhyamabi vandanalu(ఉద్యమాభినందనలు)

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా లక్షలాది మంది ఉద్యోగులతో పాటు కోట్లాది మంది సకల జనులు సమ్మెకు దిగిన చరివూతాత్మక సందర్భమిది. మొదటి రోజు సమ్మెను విజయవంతం చేసినందుకు ఉద్యోగులతో సహా తెలంగాణ బిడ్డలందరికీ ‘నమస్తే తెలంగాణ’ అభినందనలు. తెలంగాణ ప్రజల దృఢ నిశ్చయానికి ఈ సమ్మె ప్రతీక. తెలంగాణ కాంక్ష ఎంత బలమైందో తెలియంది కాదు. అయినా సమ్మె ఎట్లా మొదలవుతుందనే విషయమై పల్లెటూరి పిల్లగాండ్లు మొదలుకొని ఖండాంతరాలలోని తెలంగాణ బిడ్డల వరకు ఆసక్తిగా, కొంత ఆందోళనతో చూస్తున్న సందర్భమిది. ఒక్కోసారి మనమీద మనకే నమ్మకం సడలే స్థాయిలో వలసవాదుల ప్రచార ఉధృతి ఉన్నది. అన్ని విష ప్రచారాలను, అపనమ్మకాల ను తోసివేసి సకల జనులు ఐక్యంగా ఉద్యమించడం భూమి పుత్రుల పోరాట చరివూతలోనే అపూర్వ ఘట్టం.

లక్షలాది మంది సాధారణ ఉద్యోగులు, అధికారులు ఎవరి కోసం ఎందుకోసం సమ్మె చేస్తున్నట్టు? వీళ్లు జీత బత్తాల కోసం, ప్రమోషన్ల కోసం సమ్మెకు దిగలేదు. తమ కుటుంబ సభ్యుల భోగ భాగ్యాల కోసం ఉద్యమంలో చేరలేదు. మాతృభూమి తెలంగాణ విముక్తి కోసం కలలుకన్నరు. వలసపాలనలో బానిస బతుకులు భరించలేమన్నరు. పుట్టిన గడ్డ కు, సమాజానికి బాధ్యత వహించాలనే సోయితో ఉద్యమంలోకి దిగిండ్రు. కష్టనష్టాలకు సిద్ధపడ్డరు. కడుపుల చల్ల కదలకుండ పనిచేసే ఉద్యోగస్తులే కాదు, రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవులు కూడా సమ్మెకు దిగి ఇప్పుడు ఆంధ్ర సర్కార్‌ను పరేషాన్ చేస్తున్నరు. సింగరేణి గని కార్మికుల చైతన్యం ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి అంతటికి స్ఫూర్తినిస్తున్నది. అహరహం రెండు చేతుల వేగంగా బీడీలు చుట్టే దయ గల తల్లులు సమ్మెకు దిగిండ్రు. తెలంగాణ తల్లి ఎంత అదృష్టవంతురాలు! ఏ గడ్డమీదనైనా ఇంత మంది త్యాగధనులు పుడతారో లేదో!

కోట్లాది మంది హృదయాలలో వెల్లివిరుస్తున్న సంఘీభావం వెనుక 1969లో ప్రాణా లు పణంగా పెట్టి పోరాడిన పసివాళ్ళు పోసిన చాలు ఉన్నది. అణువణువు కొలిమై రగిలిన శ్రీకాంతాచారి, యాదయ్య, యాదిడ్డి వంటి వందలాది మంది బిడ్డల త్యాగం ఉన్న ది. ఊరూరా, వాడవాడలా జేఏసీలుగా ఏర్పడి పోటీ పడి, వరుస పెట్టి దినం రాత్రి నిరాహారదీక్షలు పట్టి ఉద్యమిస్తున్న కోట్లాది మంది పల్లె బిడ్డల పోరాట పటిమ ఉన్నది. తెలంగాణ ద్రోహులకు సంఘ బహిష్కరణ విధించిన సబ్బండ వర్ణాల కుల కట్టు తీర్పు ఉన్నది. వేలు కాదు, లక్షలు కాదు, కోట్లాది గొంతులు ఇప్పుడు ఒక్కటై తెలంగాణ కావాలని నినదిస్తున్నయి. ఇంకా సమ్మెలో చేరని నికృష్టులు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నరు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను కాలదన్ని, అధిష్ఠానాలకు వంత పాడుతున్నరు. వారు ఇప్పటికైనా కండ్లు తెరిచి ప్రజల దిక్కు రావాలె. లేదా చరివూతలో ద్రోహులుగా మిగిలిపోతరు.

ఈ సమ్మె హటాత్తుగా వచ్చినది కాదు. మూడు తరాల కష్టాల, కన్నీళ్ళపై తిరుగుబాటు. కనిపించని కుట్రలకు బలైన పల్లె బతుకులు... నీళ్ళు లేక, కరెంటు రాక, గొట్టం బావులు తవ్వీ తవ్వీ అలసిసొలిసి నాలుగు మెతుకుల కోసం అరిగోస అనుభవించిన రైతన్న వెత లు... కందీలు వెలుగుల ఎగిలివారే దానుక కంటికి కునుకు రాకుండా కష్టపడి చదివి రాత పరీక్ష నెగ్గినా, ఇంటర్వ్యూల ఆంధ్ర పెద్దలు ఇకిలించి సకిలించి చేసిన అవమానాలు... ఆఫీసులల్ల, సినిమాలల్ల, పత్రికలల్ల ఎక్కడబడితె అక్కడ తెలంగాణపై ఎటకారాలు... అనేక అన్యాయాలు, అవమానాలు... అనుభవించే ఒక్కో హృదయం ఒక అగ్ని పర్వతం... రగి లి రగిలి... ఒక్కసారి బద్దలైనయి. ఒక మహోద్యమంగా మారినయి.
తెలంగాణ జనం ప్రతి దశలో ప్రతి పరీక్షకు నిలబడి నెగ్గుతూనే ఉన్నరు. 1969లోనే ఎన్నికల ద్వారా తమ ఆకాంక్షను వెల్లడించిండ్రు. మలి దశ ఉద్యమంలో తెలంగాణ వాదానికి కట్టుబడుతున్నట్టు చెప్పిన ప్రతి పార్టీని నెత్తిల పెట్టుకున్నరు.

డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటన తరువాత ఆంధ్ర పార్టీల ద్రోహం బయటపడింది. దీంతో ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ వాదానికి అనుకూలంగా తిరుగులేని తీర్పు ఇచ్చిండ్రు. త్యాగాలు చేసిండ్రు. ఇప్పుడు సకల జనులు సకల విధాల సమ్మెను చేస్తున్నరు. తెలంగాణ ఆకాంక్ష ఎంత గాఢమైందో నిరూపిస్తున్నరు.

ఆంధ్ర పెత్తందారులు ఇప్పుడేమంటరు? తెలంగాణ ఉద్యమం ఉన్నదా లేదా? ఆంధ్ర మీడియా అబద్ధాల కూతలు ఇంకా ఎన్నాళ్ళు వినిపిస్తది! గూఢచార నివేదికలు, ముఖ్యమంత్రి, గవర్నర్ నివేదికలు ఇంకా తెలంగాణ ఎట్లున్నదని పంపిస్తరు? సకల జనుల సమ్మె సాగుతున్నది. తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వమే లేదు. అంతో ఇంతో ఉంటే ఆంధ్ర ప్రభుత్వమే. సింగరేణి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇంకా ఒక్కో దెబ్బ పడుతనే ఉంట ది. ఉత్తర దక్షిణ భారతాల మధ్య తొవ్వలు బంద్. సరుకులు కొంచబోవుడు బంద్. కోట్ల రూపాయల పన్నుల వసూలు బంద్. సినిమాలు బంద్. ఇంకా వేరే నివేదికలు ఎందుకు? దసరా, దీపావళి పండుగలు వస్తున్నయి. అయినా ఫరవాలేదు. పరాయిపాలనలో పప్ప న్నం కన్నా, బానిసత్వం నుంచి స్వేచ్ఛ కోసం సాగే పోరాటంలో తొక్కన్నం తిందాం. ఖైదీలకు మిఠాయిలు పంచే సర్కారు మనకు వద్దు. ఊచల వెనక సూర్యోదయాన్ని చూస్తున్న రేపటి విజేతలం మనం. మనకు పోరాటమే ఊపిరి. ఆత్మాభిమానమే మన సంపద.

శ్రీకృష్ణ కమిటీ నికృష్టపు సూచనలు మా ముందల చెల్లవ్. ఆంధ్ర పాలకుల మాయోపాయాలు, విభజించి పాలించే నీతి ఇక చెల్లదు. డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు కేంద్రం కట్టుబడాలె. ఏ తారీఖులోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తరో చెప్పాలె. మాకు కావలసింది ఆజాద్... అవును ఆజాద్.. అందుకు ప్రత్మామ్నాయం లేదు.

No comments:

Post a Comment