Tuesday 20 September 2011

thikkulu pikkatillela thigbandam(దిక్కులు పిక్కటిల్లేలా దిగ్బంధం )

పయ్య తిరగలేదు..చీమ దూరలేదు-అపూర్వ స్థాయిలో రోడ్లపై ఆందోళన-ఢిల్లీకి సెగ తాకించిన రహదారుల దిగ్బంధం- తొమ్మిది ప్రధాన కేంద్రాల్లోనూ విజయవంతం- వందలాది ఉప కేంద్రాల్లో ఆందోళనలు.. లక్షలాదిగా పాల్గొన్న తెలంగాణవాదులు- ఏక కంఠంతో జై తెలంగాణ నినాదాలు.. వేల సంఖ్యలో నిలిచిన లారీలు- నల్లగొండ సరిహద్దుల్లో గోడ కట్టారు.. పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు బంద్- డిపోల్లోనే బస్సులు.. విధులు బహిష్కరించిన 50వేల మంది ఆర్టీసీ కార్మికులు- మోగని బడి గంటలు.. తెరుచుకోని కార్యాలయాలు- మిన్నంటిన ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు.. పెరిగిన నిర్బంధం.. పలు చోట్ల అరెస్టులుతొమ్మిది ప్రధాన కేంద్రాలు.. వందలాది ఉప కేంద్రాలు.. లక్షలాది ప్రజలు.. 14 గంటలపాటు.. జాతీయ రహదారుల దిగ్బంధం! పయ్య తిరగలేదు.. చీమ చొరబడలేదు..! ఏ ఉద్యమ చరివూతలోనూ లేనంతగా.. ఏ ఆందోళనలోనూ కనీవినీ ఎరుగనంతగా.. అపూర్వ ఉద్యమ సమ్మేళనం.. సకల జనులు ఒక్కటైన చేతనం! రహదారుల దిగ్బంధానికి ఆర్టీసీ సమ్మె తోడై.. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య సంబంధాలు తెగిపోయిన తరుణం! తెలంగాణ నుంచి సీమాంవూధకు వెళ్లిన బస్సు లేదు.. సీమాంధ్ర నుంచి తెలంగాణలోకి వచ్చిన వాహనంలేదు! అంతా దిగ్బంధం! కిలోమీటర్ల పొడవున స్తంభించిపోయిన ట్రాఫిక్.. వేల సంఖ్యలో నిలిచిపోయిన లారీలు.. బస్సులు.. ! పొరుగు రాష్ట్రాలకూ రోడ్లు మూసుకుపోయాయి! ఇది సోమవారం నాటి రహదారుల దిగ్బంధం, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫలితం! ఉదయం నుంచి రాత్రి దాకా ఉద్యమం హోరెత్తింది.ఆదిలాబాద్ జిల్లా అంతపూరాష్ట్ర సరిహద్దు భోరజ్ వద్ద 20వేల మంది రోడ్లపైకి వస్తే.. మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద 40వేల మంది ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. నల్లగొండ జిల్లాలో 9వ నెంబర్ జాతీయ రహదారి దాదాపు 150 కిలోమీటర్ల మేర స్తంభించిపోయింది. రోడ్లపై 30వేల మంది ప్రజలు ఏక కంఠంతో జై తెలంగాణ నినాదాలు చేశారు. ఇతర తెలంగాణ జిల్లాలోనూ అదే జోరు కనిపించింది. పది జిల్లాల్లో మొత్తం 9,637 బస్సులుంటే కేవలం 45 బస్సులు మాత్రమే.. అదీ పోలీసు పహారాతో నడిచాయి. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దూకారు. బస్టాండ్లు బోసిపోయాయి. డిపోలన్నింటికీ తాళాలు పడ్డాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రసాధన దిశగా సకల జనుల సమ్మె ఏడు రోజులను పూర్తి చేసుకుంది! ఎక్కడా వాహనాలు తెలంగాణ సరిహద్దులను దాటలేదు. సరిహద్దులన్నీ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లాయి.అటు ఉద్యోగులు, కార్మికుల సమ్మె సమరోత్సాహంతో సాగుతున్నది. ప్రభుత్వ కార్యాలయాల తలుపులు తెరుచుకోలేదు. ఫ్యాక్టరీ సైరన్ మోగలేదు. బడి గంట కొట్టనేలేదు. సింగరే గనుల్లో అదే నిర్మానుష్యం. వివిధ పట్టణాలు, గ్రామాల్లో నిరాహార దీక్షలు.. నిరసన ప్రదర్శనలు హోరెత్తించాయి. సమ్మెను అణచివేసేందుకు సీమాంధ్ర సర్కారు కుతంవూతాలు జోరు పెరిగాయి. నిర్బంధకాండ అమల్లోకి వచ్చింది. పలు జిల్లాల్లో భారీగా అరెస్టుల పర్వం సాగింది. సింగరేణిలో పోలీసులు విరుచుకుపడ్డారు. 30 మంది మహిళలు సహా 150 మంది కార్మికులను అరెస్టు చేశారు. ఓ కార్మికుడి కాలు విరగ్గొట్టారు. ఇటు రాజధానిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, నిజాం కాలేజీల్లో లాఠీలు విరిగాయి.. బాష్పవాయుగోళాలు పేలాయి.. రబ్బరు తూటాలు దూసుకొచ్చాయి! అయినా వెరవబోమన్న తెలంగాణవాదులు.. వేరుపడేదాకా ఉద్యమం విరమించేది లేదని ప్రతినబూనారు!!

No comments:

Post a Comment